న్యూఢిల్లీ, మే 8: క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించేందుకుగానూ 2027 నాటికి దేశంలో డీజిల్‌తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ సూచించింది. దేశంలో వాహన కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సూచనలు చేసింది.
2027 నాటికి పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, కాలుష్యం ఎక్కువగా ఉన్న పట్టణాల్లో విద్యుత్తు, గ్యాస్ వాహనాలే ఉండేలా చూడాలని సూచించింది. 2024 నుంచి డీజిల్ బస్సులకు అనుమతి ఇవ్వొద్దని, 2030 నాటికి సిటీ బస్సులు మొత్తం విద్యుత్తువే ఉండాలని పేర్కొన్నది.
విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ సబ్సిడీలను కొనసాగించాలని సూచించింది. కార్గో కోసం ఎక్కువగా రైళ్లు, గ్యాస్ ట్రక్‌లపై ఆధారపడాలని, రానున్న రెండు, మూడేండ్లలో మొత్తం రైల్వే నెట్వర్క్ అంతా విద్యుత్తుతోనే నడిపించాలని పేర్కొన్నది. కాగా, అండర్‌గ్రౌండ్ గ్యాస్ స్టోరేజీపై భారత్ దృష్టి సారించాలని సైతం ఈ కమిటీ కేంద్రానికి సూచించింది.