ముంబై: అక్కడి ప్రజలకు వేగంగా జుట్టు రాలిపోతోంది. (Mass Hair Loss) వారం రోజుల్లో వారికి బట్టతల వస్తున్నది. ఇది చూసి మూడు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎరువుల వల్ల వాటిల్లిన నీటి కాలుష్యమే దీనికి కారణమని ఆరోగ్యశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ జిల్లాలోని బోర్గావ్, కల్వాడ్, హింగ్నా గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా వింత సమస్య ఎదుర్కొంటున్నారు. పురుషులు, మహిళలకు వేగంగా జుట్టు రాలిపోతున్నది. వారం రోజుల్లో పెద్ద సంఖ్యలో జనానికి బట్టతల వస్తున్నది. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు ఆ గ్రామాలను సందర్శించారు. వేగంగా జట్టు రాలిపోతున్న వారిని పరిశీలించారు. బట్టతల వస్తున్న 50 మందిని గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరుగవచ్చని భావిస్తున్నారు. బాధితుల చర్మం, వెంట్రుకల నమూనాలతోపాటు ఆ గ్రామాల్లోని నీటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. పొలాల్లో ఎరువుల వాడకం వల్ల వాటిల్లిన నీటి కాలుష్యం దీనికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ గ్రామస్తులకు సూచించారు.