Santas thrashed | గుజరాత్లో శాంటాక్లాజ్‌లపై దాడి జరిగింది. శాంటాక్లాజ్ వేషధారణలో ఉన్న వ్యక్తులను పట్టుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు వారికి దేహశుద్ధి చేసి దుస్తులు విప్పారు. వారి చేతుల్లో నుంచి తప్పించుకున్న వారిద్దరూ బతుకుజీవుడా అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. భజరంగ్ దళ్, వీహచ్పీ కార్యకర్తల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్మస్ పండుగ తర్వాత ఇలా కార్నివాల్ జరుపుకోవడం ఆనవాతీగా వస్తున్నదని, మత మార్పిడి అంటూ శాంటాలపై దాడి చేయడాన్ని పలువురు క్రిస్టియన్లు విమర్శిస్తున్నారు.
అహ్మదాబాద్‌లో కంకారియా కార్నివాల్‌ను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్నివాల్‌కు శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు రావడాన్ని చూసిన భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు.. మత మార్పిడులు జరుపుతున్నారని అనుమానించి వారిపై దాడికి పాల్పడ్డారు. వారి చేతుల్లో నుంచి తప్పించుకుని పారిపోయి ఇద్దరూ తమ ప్రాణాలు కాపాడుకున్నారు. శాంటాక్లాజ్లను వెంబడించి కొట్టిన వీడియోలు వైరల్‌గా మారింది. చర్చికి వెళ్లి మతప్రచారం చేపట్టకుండా ఇక్కడికొచ్చి ప్రజల మైండ్వాష్ చేయడం ఏంటని శాంటాలను భజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రశ్నించారు. శాంటాక్లాజ్ దుస్తుల్లో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ పుస్తకాలు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నట్లు భజరంగ్ దళ్ నాయకుడు జ్వలిత్ మెహతా చెప్పారు.
కంకారియా కార్నివాల్లో క్రైస్తవ మిషనరీలు బైబిల్ పుస్తకాలను పంపిణీ చేయడం ఏంటని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి హితేంద్ర సింగ్ రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఇలాంటి మతమార్పిడులను సహించేది లేదని కరాఖండితంగా చెప్పారు. కార్నివాల్లో మతమార్పిడి జరుగుతున్న ఆరోపణలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు కార్నివాల్‌ను నిలిపివేయించారు. కాగా, కార్నివాల్ ఏటా జరుపుకుంటున్నామని, ఇది ఎంత మాత్రమూ మత మార్పిడిల వేదిక కాదని పలువురు క్రిస్టియన్లు ఆందోళన వెలిబుచ్చారు. ఇలాఉండగా, కంకారియా కార్నివాల్ ఏటా డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే వారం రోజుల పండుగ. ఈ కార్నివాల్లో వివిధ సాంస్కృతిక, కళ, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పండుగను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.