బెంగళూరు, నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: అధికారం ఉంటే ఏదైనా సాధ్యమేనని లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప ఉదంతం చూస్తే అనిపిస్తుంది. ఈ కేసులో అధికారులను రాత్రికిరాత్రే హఠాత్తుగా మార్చేసింది బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. గత వారం రూ.40 లక్షల లంచం తీసుకుంటున్న విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ను లోకాయుక్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నది.
ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఆయన పరారయ్యాడు. పోలీసులు వెతుకుతుండగానే హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఏదో ఘనకార్యం చేసినట్టు మంగళవారం దావణగెరె జిల్లాలోని చన్నగిరి నియోజకవర్గంలో భారీ ఊరేగింపు జరిపారు. ఇప్పుడేమో నిందితులను ప్రశ్నించడానికి కొద్ది గంటల ముందు ఏకంగా ఈ కేసు దర్యాప్తు అధికారులనే మార్చేశారు. దర్యాప్తు అధికారులుగా డిప్యూటీ ఎస్పీ ప్రమోద్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమారస్వామి స్థానంలో ఆంథోని జాన్, బాలాజీ బాబును నియమించారు.

ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్‌కు మదల్ విరూపాక్షప్ప చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఓ కాంట్రాక్టుకు సంబంధించి రూ.40 లక్షల లంచాన్ని ఎమ్మెల్యే తరఫున ఆయన కుమారుడు తీసుకుంటుండగా, లోకాయుక్త గత గురువారం పట్టుకొన్నది. తర్వాత ఎమ్మెల్యే, ఆయన కుమారుడి ఇండ్లలో జరిపిన సోదాల్లో రూ.8.23 కోట్ల నగదు, బంగారం, వెండి వస్తువులతో పాటు భూములు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అప్పటి నుంచి పరారై మంగళవారం బెయిల్ తెచ్చుకున్నారు.
విరూపాక్షప్పకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పట్ల బెంగళూరు న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. విరూపాక్షప్ప దర్యాప్తు సంస్థల ముందు 48 గంటలలోపు హాజరవుతానని లేఖ ఇచ్చిన మరునాడే కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వివరించారు.
ఇది కచ్చితంగా ‘వీఐపీ ట్రీట్మెంటే’నని ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి ముందస్తు బెయిల్ కేసులు లిస్టు కావడానికి రోజులు, వారాల సమయం పడుతుందని, అయితే ఈ కేసులో ‘వీఐపీ’ ఒత్తిడి ప్రభావమో, ఏమో ఒక్క రోజుకే బెయిల్ వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి చర్యల వల్ల న్యాయవ్యవస్థపై సామాన్యులు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నదన్నారు.