న్యూఢిల్లీ, మార్చి 16 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ పెరగడంతో కొత్త మోడళ్ల రాక ఎక్కువైంది. ఈ క్రమంలో చైనా సెర్చింజన్ దిగ్గజం ‘బైదూ’ తాజాగా రెండు కొత్త ఏఐ మోడళ్లను ఆవిష్కరించింది. ఎర్నీ 4.5, ఎక్స్1 పేరుతో ఈ చాట్బాట్లను తీసుకొచ్చింది. ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని, విశ్లేషించగల సామర్థ్యం వీటికి ఉన్నట్టు ‘బైదూ’ వెల్లడించింది. మల్టీ మోడల్ సామర్థ్యం కలిగిన ఈ రెండు చాట్బాట్లకు అద్భుతమైన మెమరీ, ఐక్యూ ఉన్నదని, టెక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు సహా అనేక రకాల సమాచారాన్ని ఇవి విశ్లేషించగలవని పేర్కొంది. ముఖ్యంగా ఎక్స్1 మోడల్ ఏ విషయాన్నైనా అర్థం చేసుకుని ప్రణాళికలు రచించగలదని, అటానమస్ ఎబిలిటీతో కూడిన డీప్ థింకింగ్ ఏఐ మోడళ్లలో ఇదొకటని ‘బైదూ’ తెలిపింది.