Mysterious deaths : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బధాల్ గ్రామంలో ఇటీవల నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో హోంశాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా దీనిపై అసెంబ్లీలో స్పందించిన ప్రభుత్వం.. మృతుల శరీరాల్లో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది.
మరోవైపు క్లినికల్ రిపోర్టులు, ల్యాబొరేటరీ పరిశోధనలు, పర్యావరణ విభాగాలు చేసిన విశ్లేషణలు కూడా బ్యాక్టీరియా లేదా వైరల్ మూలంగా ఆ మరణాలు సంభవించలేదని పేర్కొన్నాయి. చనిపోయిన వారు తిన్న ఆహార నమూనాల్లో అల్యూమినియం, క్యాడ్మియంతోపాటు కొన్ని రకాల రసాయన మూలకాల అవశేషాలు ఉన్నట్లు తెలిపాయి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చేసిన విశ్లేషణలో క్లోర్ఫెనాపైర్ అనే పురుగుమందు అవశేషం ఉన్నట్లు తేలింది. అయితే ఈ విష పదార్థాల మూలాలు ఎక్కడివనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని జమ్మూకశ్మీర్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సకీనా ఇటూ చెప్పారు.
డిసెంబర్ 7 నుంచి జనవరి 19 మధ్య రాజౌరీ జిల్లాలోని బధాల్ గ్రామంలో 17 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు. వారిలో 12 మంది చిన్నారులే ఉన్నారు. 17 మంది మరణించడమేగాక మరో యాభై మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపింది. అధికారులు బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్‌లకు పంపించారు. ఎన్ఐవీ (పుణె), ఎన్సీడీసీ (ఢిల్లీ), ఎన్ఐటీఆర్ (లక్నో), డీఆర్‌డీఈ (గ్వాలియర్) తోపాటు చండీగఢ్, జమ్మూలలో ఉన్న ల్యాబ్‌లలోనూ పరిశోధనలు చేశారు.
అమాయక ప్రజలపై విష ప్రయోగం ఎవరు చేస్తారని ఎన్సీ సభ్యుడు జావెద్ ఇక్బాల్ చౌద్రీ ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నించారు. దాంతో ఈ మరణాలకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని మంత్రి సకీనా ఇటూ బదులిచ్చారు. ఈ మిస్టరీ మరణాల ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని, అది పూర్తైన తర్వాత వారి డిమాండ్లను పరిశీలిస్తామని ఆరోగ్య మంత్రి తెలిపారు.