న్యూఢిల్లీ: థార్ ఎడారి(Thar Desert) ప్రాంతానికి చెందిన బ్యాక్టీరియా.. తూర్పు హిమాలయ ప్రజలపై తీవ్ర ఆరోగ్య ప్రభావం చూపుతున్న అంశం కొత్త భయాందోళనకు గురి చేస్తున్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన ఓ రిపోర్టు.. ఎడారి బ్యాక్టీరియా స్థాన చలనం గురించి వివరించింది. ఎడారిలో వచ్చే ఇసుక తుఫానులతో అక్కడ ఉండే బ్యాక్టీరియా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. దీని వల్ల శ్వాసకోస, చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నట్లు పసికట్టారు. ఈ అంశంపై చేపట్టిన ఓ నివేదికను రిలీజ్ చేశారు.
వాస్తవానికి హిమాలయ శిఖర ప్రాంతాలు మనుషుల ఆరోగ్యానికి లాభదాయకంగా భావిస్తారు. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ వ్యాపిస్తున్న బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి. పశ్చిమ భారత్ నుంచి వస్తున్న ఇసుక తుఫాన్లను గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం పరిశీలిస్తున్నది. బోస్ ఇన్స్టిట్యూట్తో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ శక్తివంతమైన దుమ్ము తుఫాన్లను స్టడీ చేశాయి. గంగా పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన కలుషితానికి ఆ ఇసుక తుఫాన్లే కారణం. అయితే దీనితో పాటు హిమాలయాలకు కూడా ఆ తుఫాన్లు ఎయిర్‌బోర్న్ బ్యాక్టీరియా, ప్యాథోజన్లను మోసుకెళ్తున్నట్లు గుర్తించారు.
హిమాలయాల్లో ఉండే 80 శాతం బ్యాక్టీరియా.. దీర్ఘశ్రేణి రవాణా వల్లనే అక్కడి బ్యాక్టీరియా కలుషితమవుతున్నట్లు భావిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అవుతున్న బ్యాక్టీరియా వల్ల హిమాలయాల్లోని సహజ బ్యాక్టీరియా 60 శాతం అలజడికి గురవుతున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఇటీవల వరుసగా మూడు రోజుల పాటు పరిశోధకులు తూర్పు హిమాలయాలను పరీక్షించారు. ఆ పరీక్షల ఆధారంగా థార్ ఎడారి నుంచి వస్తున్న దుమ్ము.. హిమాలయాలపై సుమారు మూడు కిలోమీటర్ల మేర ఓ చిక్కటి పొరగా ఏర్పడుతున్నట్లు పరిశోధకులు పసికట్టారు.
దూరం నుంచి ప్రయాణించిన బ్యాక్టీరియాతో స్థానిక ప్యాథోజన్లు కలిసి .. ఆ రెండూ కొత్త తరహా బ్యాక్టరీయా కమ్యూనిటీగా మారుతున్నట్లు అంచనా వేశారు. దీని వల్ల గ్యాస్ట్రో సంబంధిత జబ్బులు కూడా వస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ఈ స్టడీని పబ్లిష్ చేశారు. థార్ ఎడారి దుమ్ము తుఫాన్‌తో వస్తున్న బ్యాక్టీరియా.. హిమాలయా ప్యాథోజెన్స్తో కలిసి స్థానికంగా ఆరోగ్య సంక్షోభాన్ని క్రియేట్ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తన రిపోర్టులో పేర్కొన్నది.