MiG-21 | భారత వైమానిక దళం (IAF) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21 (MiG-21). భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి.. ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్-21 శకం ముగిసే వేళైంది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత మిగ్ ఫైటర్ జెట్లు రిటైర్ కాబోతున్నాయి. భారత గగనతలంలో శత్రువుకు సింహస్వప్నంగా నిలిచిన ఈ యుద్ధ విమానాల సేవలు రేపటితో ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఫైటర్ జెట్‌కు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ (Air Chief Marshal A P Singh) వీడ్కోలు పలకనున్నారు. ఐఏఎఫ్ చీఫ్ స్వయంగా మిగ్-21 బైసన్ (MiG-21 BISON) పై చివరి సార్టికి వెళ్లనున్నారు.
మిగ్-21 ఫైటర్ జెట్స్.. 1963లో ఐఏఎఫ్‌లో చేరాయి. భారత వైమానిక దళం (IAF) ఫైటర్ జాబితాలో మొట్టమొదటి సూపర్సోనిక్ విమానం. అప్పటి నుంచి మిగ్-21 యుద్ధ విమానాలు భారత్‌కు వెన్నెముకగా నిలిచాయి. 1965, 1971లలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, 1999లో కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ సహా అనేక కీలక ఆపరేషన్లలో ముఖ్య పాత్ర పోషించాయి. వేగం, చురుకుదనం, పోరాట పటిమతో ఈ విమానం భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాలు సాధించాయి.
అయితే, విజయాలతోపాటూ పలు అప్రతిష్ఠలు కూడా మూటగట్టుకుంది. తొలినాళ్లలో ‘ఫ్లయింగ్ డాగర్’ (Flying Daggers)గా పేరుపొందిన ఈ విమానం సాంకేతికత పాతదైపోవడం, తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో ‘ఎగిరే శవపేటిక’ (Flying Coffin) అనే అప్రతిష్ఠను మూటగట్టుకుంది. 1963 నుంచి ఇప్పటివరకు సుమారు 400 మిగ్-21 జెట్లు కూలిపోగా, సుమారు 200 మంది పైలట్లు, 40-60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
శుక్రవారం ఛండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా మిగ్-21 వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీడీఎస్ అనిల్ చౌహాన్ , త్రివిధదళాల అధిపతులు, ఆరుగురు వాయుసేన మాజీ చీఫ్‌లు, ఐఏఎఫ్ కమాండ్ల అధిపతులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో 23వ స్క్వాడ్రన్‌కు చెందిన 6 మిగ్-21లు భాగం కానున్నాయి. సార్టి పూర్తి చేసుకొని ల్యాండ్ అయ్యాక జలఫిరంగులతో అభివాదం సమర్పించనున్నారు. విజయాలు, విషాదాలతో నిండిన తన ప్రస్థానాన్ని ముగించుకుని మిగ్-21 ఇక చరిత్ర పుటల్లోకి చేరేందుకు సిద్ధమైంది.
Also Read..
Ladakh Violence | లద్ధాఖ్‌లో ఆందోళనలు.. 50 మంది అరెస్ట్
Ladakh Violence | లద్దాఖ్‌లో జరిగింది జన్ జెడ్ నిరసనలు కాదు.. కాంగ్రెస్ నిరసన : బీజేపీ