Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగల సీజన్లలో అయితే దాదాపుగా అన్ని రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ప్రస్తుతం దీపావళి సందర్భంగా ఇతర నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు పండగకోసం సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు కొన్ని ప్రమాదకరమైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించట్లేదు.
గడిచిన రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పలు పండగలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉండటంతో దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. దీంతో పనినిమిత్తం, చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగపూట ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు కొన్ని వస్తువులను నిషేధించారు. రైళ్లలో పెట్రోల్, డీజిల్, ఫైర్వర్స్క్, గ్యాస్, ఓవెన్, సిగరెట్లు వంటి ప్రమాదకర వస్తువులను ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించట్లేదు.
నిబంధనలకు విరుద్ధంగా రైలు ప్రయాణంలో నిషేధిత వస్తువులను తీసుకెళ్తే నేరం చేసినట్లే లెక్క. ఎవరైనా పైన పేర్కొన్న నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే.. రైల్వే చట్టంలోని సెక్షన్ 164, 165 ప్రకారం ఆ ప్రయాణికుడిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. రూ.1000 జరిమానాతోపాటు, మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
By carrying firecrackers on trains, you carry the risk of life!
Carrying inflammable and explosive articles in a train is a punishable offense. #IndianRailways pic.twitter.com/uhR2yBVkeM— West Central Railway (@wc_railway) October 14, 2022