తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న మీరు ఎవరో ఆడిస్తే కీలుబొమ్మలా వ్యవహరించడం శోచనీయం. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరం. ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న మీకు ఎవరు ఆదేశిస్తే బాయ్‌కాట్ చేస్తారో తెలియదా? ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదని అంటున్న నీకు.. మండలి చైర్మన్ వేరే పార్టీ నుంచి వచ్చారు. మరి ఆయన ఉద్యమకారుడిలా కనిపించారా? నాలుగు నెలల కిందట రాజీనామా చేసి మళ్లీ మండలికి ఎందుకువెళ్లారు?
-గొంగిడి సునీత
BRS | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): పార్టీలో పదవులు అనుభవించి..కేసీఆర్ వ్యతిరేకశక్తుల చేతిలో పావుగా మారి తల్లిలాంటి పార్టీని దూషించడం, అధినేతపై దుమ్మెత్తిపోయడం సరికాదని, జాగృతి అధ్యక్షురాలు కవిత పద్ధతి మార్చుకోవాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హెచ్చరించారు. తాను కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూడటం, కేసీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఏం తక్కువ చేసిందని మండలిలో కంటతడిపెట్టారని ప్రశ్నించారు. ‘మీ వెనుక ఎవరున్నారో.. మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారో.. తెలంగాణ ప్రజలకు తెలుసు’ అని స్పష్టంచేశారు.
సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమ, సుమిత్రాఆనంద్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. పవిత్రమైన మండలిలో కవిత పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ప్రజాసమస్యలను విస్మరించి వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. ఆమెకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ పెట్టుకొని ప్రజాసమస్యలపై పోరాడాలని, అంతేగానీ కేసీఆర్ శత్రు పార్టీలకు మేలు చేసేలా వ్యవహరించడం ఎంతవర కు సమంజసమని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని తప్పుబడుతున్న కవిత.. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారని సునీత ప్రశ్నించారు. తనవద్దకు అంగన్వాడీలు, ఆయాలు చాలామంది వస్తున్నారని చెప్తున్న కవిత మండలిలో వారి సమస్యలను ఎందుకు లేవనెత్తలేదని నిలదీశారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని మాట్లాడుతున్న కవిత.. తన అనుయాయులకు ఏవిధంగా పదవులు ఇప్పించుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లినప్పుడు బెయిల్ కోసం రాత్రింబవళ్లు ఢిల్లీలో మకాంవేసి హరీశ్‌రావు, కేటీఆర్ ఎంతో కష్టపడ్డారని, వారిపై ఆరోపణలు చేయడానికి కవితకు నోరెలా వచ్చిందని నిలదీశారు. ఇప్పటికైనా కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లేదంటే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
జనంబాట పేరిట రాజకీయ యాత్రలు చేస్తున్న కవిత బీఆర్ఎస్పై విమర్శలు చేస్తే ఊరుకొనే ప్రసక్తిలేదని సునీత తేల్చిచెప్పారు. తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని కుండబద్దలుకొట్టారు. తమ పార్టీ శ్రేణులు ఆగ్రహిస్తే గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. దమ్మూధైర్యముంటే సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సవాల్ విసిరారు. తమ పార్టీ అధినేతను, ముఖ్యనేతలను దూషిస్తే సహించబోమని స్పష్టంచేశారు.
‘లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని జైలుకెళ్లినప్పుడు వార్తలు రాసిన పత్రికలపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగిన మీరు ఎన్ని కేసులు పెట్టారు?’ అని తుల ఉమ ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం పదవులిచ్చిన కేసీఆర్, బీఆర్ఎస్పై మండలిసాక్షిగా నిందలు వేయడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను దూషిస్తే తెలంగాణ సమాజం అంగీకరించబోదని స్పష్టంచేశారు. వ్యక్తిగత వ్యవహారాల కోసమే ఆమె మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నదని దెప్పిపొడిచారు. ఉత్తముడిగా, పాలనాదక్షుడిగా పేరుపొందిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను సైతం లిక్కర్ స్కామ్‌లో ఇరికించారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్ను వీడటం వ్యక్తిగత వ్యవహారం కాదని, ఆత్మగౌరవం కోసమేనని లక్ష్మీనర్సింహస్వామిపై ప్రమాణం చేసిన మీరు..లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర లేదని ప్రమాణం చేయగలరా?’ అంటూ ప్రశ్నించారు. ‘పార్టీ పెట్టుకొనే స్వేచ్ఛ మీకు ఉన్నది..కానీ కేసీఆర్‌పై దిగజారి మాట్లాడితే ఊరుకొనేదిలేదు’ అని హెచ్చరించారు.
ఉద్యమనేత కేసీఆర్ కూతురుగా కవితను తామందరం గౌరవించామని, ఉద్యమంలో ఆమెతో కలిసి నడిచామని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రాఆనంద్ స్పష్టంచేశారు. కానీ ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని స్పష్టంచేశారు. ‘కవిత మాత్రం పదవులు అనుభవించి పార్టీపై, కేసీఆర్‌పై నిందలు వేయడం బాధాకరం..అసలు కేసీఆర్ లేకుంటే ఉద్యమంలో కవిత ఎక్కడిది? ఆమెకు వచ్చిన పదవులు ఎక్కడివి?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘ఎమ్మెల్సీగా ఏనాడో రాజీనామా చేశానని చెప్పిన ఆమె మళ్లీ సభకు ఎందుకు వెళ్లింది? ఎవరికోసం కంటతడి పెట్టింది?’ అంటూ నిలదీశారు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ఆమె గత మే నెల నుంచి సామాజిక తెలంగాణ కల సాకారం కాలేదంటూ బీఆర్ఎస్ను బద్నాం చేయడం ప్రారంభించిందని చెప్పారు. ఆమె జనం బాట పేరిట బీఆర్ఎస్పై బురదజల్లుడు యాత్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యమకారులకు పదవులు రాలేదని మాట్లాడేందుకు కవితకు అర్హతలేదని స్పష్టంచేశారు. ఆమె కోసం మొట్టమొదట బతుకమ్మ ఎత్తిన తనకు ఏం పదవి ఇప్పించారని ప్రశ్నించారు.
శాసనమండలిలో మాట్లాడిన కవిత కేసీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని సుమిత్రాఆనంద్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణకు ఉద్ధరించిందేమీలేదని విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘కవితమ్మా..కేసీఆర్ ఏం చేశారో తెలుసుకోవాలంటే రైతుబంధు తీసుకున్న రైతులు, రెండువేల పింఛన్లు తీసుకున్న అవ్వాతాతలు, కేసీఆర్ కిట్ అందుకున్న తల్లులు, కల్యాణలక్ష్మీ తీసుకున్న ఆడబిడ్డల తల్లిదండ్రులు.. పంచాయతీలుగా మారిన తండాల్లో లంబాడీలు, దళితబంధు తీసుకున్న దళితులను అడుగు. కాళేశ్వరంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా లబ్ధిపొందిన అన్నదాతలను, దేశంలో ఎక్కడా లేనివిధంగా వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు, అడగకముందే జీతాలు పెరిగిన అంగన్వాడీలు, ఆశ కార్యర్తలను అడుగు’ అంటూ హితవు పలికారు. ‘పదేండ్ల పాలనలో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్ది బతుకు చిత్రాన్ని మార్చిన కేసీఆర్‌పై నిందలేయడం..ఆయనను మానసిక క్షోభకు గురిచేయడం.. నాలాంటి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలను బాధపెడుతున్నది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్‌పై నిందలు వేయడం చూస్తే గుండె తరుక్కుపోతున్నదని సుమిత్రా ఆనంద్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించి..తెచ్చిన రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపిన మహానేతపై ఆరోపణలు చేయడం బాధాకరమని కంటతడిపెట్టుకున్నారు. కోట్లాది మంది బతుకుల్లో వెలుగులు నింపిన గొప్పవ్యక్తిని మానసికక్షోభకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని కన్నీటిపర్యంతమయ్యారు.
బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ అయిందని కవిత చేసిన ఆరోపణలు అబద్ధమని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కొట్టిపారేశారు. ‘లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన ఆమె బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడారు? అయోధ్యరాముడి గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి రాత్రికిరాత్రి తొలగించింది వాస్తవం కాదా?’ అంటూ ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలని నిలదీశారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి.. ఆయన అడుగులో అడుగువేశామని గుర్తుచేశారు. కానీ ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సమయంలో లక్షలాదిమంది నిస్వార్థంగా పాలుపంచుకున్నారని, అదే సమయంలో కవిత సైతం వచ్చారని చెప్పారు. త్యాగాలు చేసిన వారు ఏనాడూ పదవులు, పైసలు ఆశించలేదని, కవిత మాత్రం ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు తీసుకొని ఇప్పుడు పార్టీని దూషించడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్లో ఉద్యమకారులకు పదవులు దక్కలేదని చెప్తున్న మీరు..మీ జాగృతి ద్వారా ఎంతమంది బీసీలకు పదవులిచ్చారు?’అని నిలదీశారు.
జాగృతి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతగానో తపించారని గుర్తుచేశారు. తన స్వార్థం..శత్రుపార్టీల మెప్పుకోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అమరుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చారని, వేలాదిమంది ఉద్యమకారులకు పదవులిచ్చారని గుర్తుచేశారు. కానీ ఉద్యమకారులకు గుర్తింపునివ్వలేదని మండలిసాక్షిగా కవిత తప్పులు చెప్పడం శోచనీయమని వాపోయారు. ‘కేసీఆర్‌ను తిట్టడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుందో మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణను సాకుగా చూపి కేసీఆర్‌పై అవినీతి మచ్చపడ్డదని కవిత బాధపడుతున్నట్టు నటిస్తున్నదని సుమిత్రా ఆనంద్ విమర్శించారు. వాస్తవానికి కవిత లిక్కర్ స్కామ్తోనే కేసీఆర్‌పై మచ్చపడ్డదని, ఈ విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసునని స్పష్టంచేశారు. ఆమె ఎంపీగా ఓడిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో తనలాంటి ఉద్యకారులు బాధపడ్డారని చెప్పారు. ఈ విషయాలన్నీ మరచిపోయిన కవిత తెలంగాణ జాతిపితపై నీలాపనిందలు వేయడం దురదృష్టకరమని వాపోయారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి నిజానిజాలు తెలుసుకోవాలని హితవుపలికారు.