నాగ్‌పూర్, అక్టోబర్ 29 : మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే పూర్తి రైతు రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రహార్ జన్‌శక్తి పార్టీ నాయకుడు బచ్చూ కడూ సారథ్యంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రైతులు బుధవారం తమ ఆందోళనను ఉధృతం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రైళ్లను ఆపేస్తామని కూడా కడూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసనలలో మహిళలతోసహా లక్షమంది రైతులు పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ముందు రోజు మంగళవారం నాగ్‌పూర్-హైదరాబాద్ హైవే(ఎన్‌హెచ్-44)పైకి చేరుకున్న వేలాదిమంది రైతులు దాదాపు ఏడు గంటలపాటు ట్రాఫిక్ని స్తంభింపచేశారు. దీంతో 20 కిలోమీటర్ల వరకు హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రక్కులు, కార్లు, ద్విచక్రవాహనాలు బారులు తీరి నిలబడిపోయాయి. నాగ్‌పూర్-ముంబై సమృద్ధి హైవేని కూడా రైతులు అడ్డగించడంతో అక్కడా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఎన్నికల సందర్భంగా రుణ మాఫీ, పంట బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని రైతులు నిరసన తెలియచేస్తున్నారు. ప్రతి పంటకు 20 శాతం బోనస్ ఇస్తామని, సోయాబీన్స్‌పై రూ. 6,000 బోనస్ ఇస్తామని రైతులకు వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఏమీ చేయలేదని బచ్చూ కడూ తెలిపారు. కనీసం రైతులను కలుసుకునే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు, వడగళ్ల వానలతో గత ఏడాది పంటలు నాశనమయ్యాయని, తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని వారు మండిపడ్డారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు బలవనర్మరణాలకు పాల్పడుతున్నారని కడూ తెలిపారు. పూర్తి రుణం మాఫీ చేసేంతవరకు రైతులు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని ఆయన ప్రకటించారు. స్వాభిమాని పక్ష నాయకుడు రవికాంత్ తూప్కర్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైవేలు, మెట్రో ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటుంది కాని రైతుల రుణాలను మాఫీ చేయడానికి మాత్రం ఉండదని ఆయన విమర్శించారు.
రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, సోయాబీన్ రైతులకు రూ. 6,000 సహాయం అందచేయాలని, ప్రతి పంటకు 20 శాతం బోనస్ ఇవ్వాలని, భావన్తర్ యోజన(ధరల వ్యత్యాస్యాల చెల్లింపు పథకం) అమలు చేయాలని, పంటల బీమా చెల్లింపులు సకాలంలో విడుదల చేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు.