Zeeshan Siddique | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) గతేడాది అక్టోబర్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) కాల్చి చంపింది. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ (Hit List)లో సిద్ధిఖీ తనయుడు, మాజీ ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) కూడా ఉన్నట్లు తెలిసింది. తాజాగా జీశాన్ సిద్ధిఖీకి హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ‘నీ తండ్రి లాగే నిన్నూ చంపేస్తాం’ అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అతడికి బెదిరింపులు (death threat) వచ్చాయి. ఈ విషయాన్ని జీశాన్ సిద్ధిఖీ స్వయంగా వెల్లడించారు.
డి-కంపెనీ సభ్యుడి నుంచి తనకు ఈమెయిల్ ద్వారా ఈ హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే తన తండ్రి బాబా సిద్ధిఖీలానే తనను కూడా చంపేస్తామంటూ హెచ్చరించినట్లు జీశాన్ సిద్ధిఖీ తెలిపారు. ‘గత మూడు రోజులుగా నాకు వరుస బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే నా తండ్రిని చంపినట్లే నన్నుకూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు ఈ విషయంపై పోలీసులను సంప్రదించొద్దని నన్ను హెచ్చరించారు’ అని జీశాన్ సిద్ధిఖీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు జీశాన్ ఇంటికి చేరుకుని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ మేరకు బెదిరింపుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిద్ధిఖీ దారుణ హత్య
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12న దారుణ హత్యకు గురయ్యారు. ముంబయి బాంద్రాలోని ఆయన కుమారుడు జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా కార్యాలయం బయట కొందరు టపాసులు కాలుస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండుగులు తుపాకులతో కాల్పులు జరిపారు. గుండెకు తూటా తగలడంతో గాయపడిన సిద్ధిఖీని హూటాహుటిన లీలావతి దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా విచారణలో తేలింది. సిద్ధిఖీని చంపేందుకు ఒక్కో నిందితుడికి లారెన్స్ గ్యాంగ్ రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని, అలాగే మారణాయుధాలు సైతం సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు.
హత్య మేమే చేశాం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
సిద్ధిఖీని తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తమకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని, అయితే ఎవరైతే గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే సల్మాన్ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరి చేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా భావిస్తున్న శుభం రామేశ్వర్ లంకర్ ఫేస్బుక్లో హెచ్చరించాడు. బాబా సిద్ధిఖీ హత్యకు కొన్ని నెలల నుంచే నిందితులు రెకీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే గ్యాంగ్ 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.
బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో జీశాన్ సిద్ధిఖీ
బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ (Hit List)లో సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique) కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపిన షూటర్లు (Shooters) విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. తండ్రీ కొడుకుల్ని చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు షూటర్లు విచారణలో తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో తండ్రీ కొడుకులిద్దరూ ఉంటారని.. ఒకేసారి పని అయిపోతుందని షూటర్లు భావించారు. ఒకవేళ ఇద్దరిపై కాల్పులు జరిపే అవకాశం రాకపోతే.. ముందుగా ఎవరు కనిపిస్తే వారిని హతమార్చాల్సిందిగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి షూటర్లకు ఆదేశాలు వచ్చాయి.
Also Read..
JD Vance | జైపూర్ అంబర్ ఫోర్ట్‌ను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ
Arsenic | బియ్యంలో ఆర్సెనిక్.. ప్రపంచంలో 20 శాతం మందికి క్యాన్సర్ ముప్పు!
Artificial Intelligence | ఏఐతో లక్షల జాబ్స్ గల్లంతు.. బిల్ గేట్స్, బరాక్ ఒబామా హెచ్చరిక