Artificial Intelligence | న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : రానున్న కాలంలో కృత్రిమ మేధ(ఏఐ) వల్ల సంభవించే దుష్పరిణామాలపై మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన 100 సంవత్సరాలలో ప్రజలు ఎన్నడూ చూడని విధంగా రానున్న సంవత్సరాలలో లక్షలాది ఉద్యోగాలను ఏఐ భర్తీచేయగలదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అరుదైన మేధావులుగా పరిగణించే వైద్యులు, ఉపాధ్యాయులు వంటి నిపుణుల స్థానంలో ఏఐ ద్వారా ఉచితంగా సేవలు లభిస్తాయని బిల్ గేట్స్ తెలిపారు. ఏఐ వల్ల స్పల్పంగా భీతి కలుగుతున్నప్పటికీ సమస్యలను పరిష్కరించి, నూతన ఆవిష్కరణలకు మార్గం చూపగలదని ఆయన పేర్కొన్నారు. మరో వేదికపై ఒబామా మాట్లాడుతూ ఏఐతో ఏర్పడే ఆటోమేషన్ త్వరలోనే అన్ని రంగాల ఉద్యోగాలపై ప్రభావం చూపగలదని హెచ్చరించారు. దీంతో సంపాదనా మార్గాలపై ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని ఆయన చెప్పారు.
రానున్న ఏఐ యుగం మేధస్సుపై సమాజంలో ఉన్న అభిప్రాయాలను ప్రాథమికంగా మార్చివేస్తుందని బిల్ గేట్స్ తెలిపారు. ఖరీదైనవని మనం ఇప్పటి వరకు భావిస్తున్న నైపుణ్య రంగాలు రానున్న కాలంలో ఉచితంగా మారిపోగలవని చెప్పారు. గొప్ప డాక్టర్లు, గొప్ప టీచర్లను మనం అరుదైన గొప్ప మేధావులుగా భావిస్తూ వచ్చామని, రానున్న దశాబ్దంలో ఏఐ వల్ల ఈ సేవలు ఉచితంగా మారిపోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగాక డాక్టర్లు, టీచర్ల కొరతను కూడా ఇది తీర్చగలదని గేట్స్ తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగాల తీరులోనే పెను మార్పులు రాగలవని, వారానికి రెండు లేదా మూడు రోజులు పనిచేయాల్సి రావచ్చేమోనని ఆయన అన్నారు. మానవ వనరుల అవసరం ఇక ఉండే అవకాశం లేదా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఉదాహరణకు బేస్‌బాల్ విషయమే తీసుకుంటే కంప్యూటర్లు ఆ ఆటను ఆడాలని కోరుకోమని, అదే విధంగా కొన్ని విషయాలు మనుషులు మాత్రమే చేయగలిగేవి ఉంటాయని గేట్స్ తెలిపారు. అయితే వస్తువుల తయారీ, వస్తువుల రవాణా, ఆహార ఉత్పత్తి వంటి విషయాలను ఏఐ చూసుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
అత్యంత వేగంతో ఏఐ ఎదుగుతున్న తీరు పట్ల బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆటోమేషన్‌కు లేదా రోబోల సేవలకు మాత్రమే పరిమితం కాబోదని, అత్యున్నత స్థాయిలో మేధోపరమైన పని ఏఐ ద్వారా జరగనున్నదని ఒబామా అన్నారు. మెజారిటీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కన్నా అద్భుతంగా ప్రస్తుత ఏఐ నమూనాలు ఇప్పటికే పనిచేస్తున్నాయని తెలిపారు. మంచి జీతాలు చెల్లించే హై స్కిల్డ్ ఉద్యోగాల విషయానికి వస్తే రానున్న కాలంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి టాప్ ప్రొఫెషనల్స్ ఏఐని ఉపయోగించుకుంటారని, కాని సాధారణ ఉద్యోగాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఆయన చెప్పారు.