అయోధ్య : అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. తెల్లవారుజామున 4 గంటలకే బాలరాముడికి పూజలు చేస్తారు. కానీ రెండు గంటలు విరామం తీసుకుని ఆరు గంటల నుంచి దర్శనంకు అవకాశం కల్పిస్తారు. రామ్‌లల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంటల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండలేరని, రామ్‌లల్లాకు రెస్టు అవసరమని, మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 1.30 వరకు ఆలయాన్ని మూసివేయాలని ట్రస్టు నిర్ణయించినట్లు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. రామాలయాన్ని తెరవడానికి ముందు టెంటులో ఉన్న సమయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం ఉండేది. దాంట్లో మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు బ్రేక్ తీసుకునేవారు.