ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 08:10:10

అయోధ్య రాముడి ఆలయ విశేషాలు..

అయోధ్య రాముడి ఆలయ విశేషాలు..

అయోధ్య : మరికొద్ది గంటల్లోనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగబోతోంది. శ్రీరాముడు జన్మించిన స్థలంలోనే ఆలయం నిర్మాణ మధురఘట్టం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న వారి కల సాకారం కాబోతున్నది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఇవాళ మహాజ్వోల ఘట్టానికి శంకుస్థాపన జరుగనుంది. ఈ ఆలయ భూమి పూజ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. ఇక ఆలయం ఏ విధంగా ఉండాలనే దానిపై ఇప్పటికే డిజైన్లు కూడా ఖరారు కావడంతో.. ఆలయ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందనే నమూనా చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అయోధ్యలో రామాలయాన్ని భక్తులందరికీ కనుల పండువలా ఉండే విధంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్, ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే ఆలయ నిర్మాణం పూర్తయితే ఏ విధంగా ఉంటుందనే నమూనా చిత్రాలు ఇప్పుడు భక్తులను నయనానందం కలిగిస్తున్నాయి. రామాలయం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయంగా నిలువనుంది. మొదటి స్థానంలో కంబోడియాలోని అంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కాగా, రెండోది తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం, తర్వాత అయోధ్య రాముడి ఆలయం నిలువనుంది.

వెయ్యేళ్ల పాటు నిలిచేలా..

వేయ్యళ్ల పాటు నిలిచేలా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టనున్నారు. తీవ్రమైన ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించనున్నారు. రిక్టర్‌ స్కేల్‌పై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ నిర్మాణానికి ఇవాళ తొలి పునాది రాయి పండనుండగా.. మూడేళ్లలో పూరయ్యే అవకాశం ఉందని వాస్తు శిల్పులు పేర్కొంటున్నారు. ఆలయాన్ని ఉత్తర భారత్‌లోని ప్రఖ్యాత నాగర శైలిలో రామ మందిర ఆకృతి ఉండనుంది. దేశంలో ఆలయ నిర్మాణాల్లో మూడు రకాల శైలిలు ఉండగా, ఇందులో ఒకటి నాగర శైలి. ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయం కూడా నాగర శైలిలో నిర్మించిందే. రామ మందిరం ఆలయం ఆకృతిలోని మూడు అంతస్థుల్లో 366 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్తులో 160, రెండో అంతస్తులో 132, మూడో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. అష్టభుజి ఆకృతిలో రాముడి గర్భగుడి నిర్మించనున్నారు. 30 ఏళ్ల కిందట ప్రతిపాదించిన రామ మందిర ఆకృతిలో స్వల్ప మార్పులు చేశారు. రెండంతస్తులకు బదులుగా మూడు అంతస్తుల్లో ఆలయం నిర్మిస్తున్నారు. ఆలయం పొడవు 360 అడుగులు, వెడెల్పు 235, ఎత్తు 161 అడుగులు ఉండనుంది. మూడో అంతస్తు నిర్ణయంతో ఆలయం ఎత్తు 33 అడుగులు పెరిగింది. గతంలో రెండు గోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐదు గోపురాలతో నిర్మిస్తున్నారు. ప్రతిపాదిత రామాలయం ఆకృతి కన్నా కొత్త డిజైన్‌ దాదాపు రెట్టింపు అయ్యింది. 


120 ఎకరాల్లో ఆలయం

సుమారు 120 ఎకరాల స్థలంలోని ప్రాంతంలో రామ మందిర నిర్మాణం జరుగనుంది. మందిర విస్తీర్ణం దాదాపు 76వేల అడుగుల నుంచి 84వేల చదరపు అడుగులు ఉండనుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయంలో అయోధ్య రామయ్య ఆలయం నిలువనుంది. దేవాలయ సముదాయంలో ప్రధాన ఆలయం రాముడిది కాగా, చుట్టూ సీతాదేవి, లక్ష్మణుడు, భరత, శతృజ్ఞ, హనుమాన్‌ ఆలయాలు నిర్మిస్తారు. ఆలయం చుట్టూ ఐదు మండపాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు వేచి ఉండేందుకు ఐదు మండపాలను నిర్మిస్తున్నారు. ఇందులో సుమారు 5వేల నుంచి 8వేల వరకు వేచి ఉండే అవకాశం ఉంది. ఆలయంలో ఐదు ప్రవేశ ద్వారాలు, ఐదు గుమ్మటాలు నిర్మిస్తున్నారు. కాగా, ప్రపంచంలోనే ఐదు గుమ్మటాలున్న ఏకైక ఆలయం రామాలయం నిలువనుంది. ఒకేసారి పదివేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన స్టోన్‌తో ఆలయ నిర్మాణం జరుగనుంది. ఆలయ నిర్మాణానికి దాదాపు 1.75లక్షల ఘనపుటడుల రాయి అవసరం కానుంది. ఆలయ నిర్మాణానికి వినియోగించనున్న స్తంభాలను ఇప్పటికే శిల్పులు చెక్కారు. స్తంభాలపై హిందూ దేవతల రూపాలను చెక్కగా, వాటిని రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన ద్వారం నుంచి ఎంత దూరంలో నిల్చున్న కనిపించేలా రాముడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. 

రామ మందిరం నిర్మించనున్న సోమ్‌పుర కుటుంబీకులు

అయోధ్య రామాలయాన్ని సోమ్‌పుర కుటుంబీకులు రూపొందించనున్నారు. ఆలయాన్ని చంద్రకాంత్‌, ఆయన కుమారులు నిఖిల్‌, ఆశీశ్‌ రూపొందించనుండగా, వీరు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందినది సోమ్‌పుర కుటుంబీకులు. 1989 నుంచి సోమ్‌పుర కుటుంబీకులు రామ మందిరం ఆకృతిపై పని చేస్తున్నారు. పనులు ప్రారంభమైన మూడు సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని చంద్రకాంత్‌ తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
logo