న్యూఢిల్లీ, జూన్ 21 : కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల కుంభకోణంతో అభాసుపాలవుతున్నది. అయ్యో రామా.. ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు అయోధ్య రాముడిని వేడుకుంటున్నారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సంబంధించిన విరాళాల అక్రమాల పుట్టను తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే నగదు, బంగారం, వెండి, ఇతర ఖరీదైన విరాళాలు అక్రమార్కుల భోజ్యం అయినట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ముఖ్యంగా ఇంత ప్రతిష్టాత్మకమైన పెద్ద ఆలయ నిర్వహణలో ముఖ్య విభాగాలు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు జవాబుదారీతనం లేకపోవడం, వారిపై పర్యవేక్షణ, నిఘా లోపించడం, సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యం కావడం దర్యాప్తు సంస్థను ఆశ్చర్యపరిచింది.
మరోవైపు రామ మందిర విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలు సంఘ్ పరివార్‌లో ఆందోళనలు పెంచాయి. పలువురు బీజేపీ నాయకులు సైతం ఆలయ నిధుల దుర్వినియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. ఈ ‘ఛడావా(విరాళాల) చోరీ’పై మనోభావాలు దెబ్బతిన్న కోట్లాది మంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ మందిరానికి వచ్చిన విరాళాల్లో కోట్ల రూపాయలు మాయమయ్యాయంటూ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ఈ నెల మొదట్లో తెరపైకి వచ్చింది. కాగా, దీంతో ఈ ఆరోపణలనూ దర్యాప్తు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 13న ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) నియమించింది.
అయోధ్య మందిర విరాళాల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్ తన ప్రాథమిక నివేదికను ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు సమర్పించినట్లు సమాచారం. అవకతకవలకు బాధ్యులైన పలువురిని గుర్తించిన సిట్ వారి గురించి తన నివేదికలో నివేదించింది. అయితే ఇందులో దేవాలయ ట్రస్ట్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన వారెవ్వరూ లేరని తెలిసింది. గత ఆరు రోజులుగా జరిపిన దర్యాప్తు గురించి క్లుప్తంగా ముఖ్యమంత్రికి వివరించింది.
అయోధ్య మందిర విరాళాల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్ ఇప్పటివరకు 150 మంది అనుమానితులను గుర్తించింది. వీరిలో 25 మంది నేరుగా ప్రత్యక్ష విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుమానితులతో పాటు ట్రస్ట్ నిర్వాహకులు, ఆలయ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో అయోధ్య వదిలిపోరాదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, సిట్ బృందం ఇప్పటికే సిబ్బంది నియామకం, రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించడంతో పాటు దీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఆర్థిక రికార్డులు ఎలా నిర్వహిస్తున్నది, విరాళాలు, ఖరీదైన వస్తువులను ఎలా నిర్వహస్తున్నది అధికారులను ప్రశ్నించింది. కాగా, శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనీల్ మిశ్రా, రామ మందిర నిర్మాణ ఇన్చార్జి గోపాల్ రావులను సిట్ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆరు గంటల పాటు విస్తృతంగా ప్రశ్నించింది. ఐదుగురు ప్రధాన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ ఇప్పటికే రూ.2 కోట్లను స్వాధీనం చేసుకుంది. వీరు ప్రధానంగా విరాళాల లెక్కింపు సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. వారిలో ఒక వ్యక్తి ఇంటి నుంచి బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.
అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల సిట్ బృందానికి రామ మందిరానికి, విరాళాల లెక్కింపు గదికి చెందిన సీసీ ఫుటేజీ పరిమిత కాలానికి మాత్రమే లభ్యం కావడం ఆటంకంగా మారింది. ఆలయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం సీసీ కెమెరాల ఫుటేజీ 45 రోజులది మాత్రమే లభ్యమవుతుంది. 45 రోజులు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. కాగా, లభ్యమైన ఫుటేజీ కూడా అనధికారికంగా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని సిట్ అనుమానిస్తున్నది. సుమారు 8 నెలల సీసీటీవీ ఫుటేజీను పూర్తిగా తుడిచిపెట్టేసినట్టు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం కూడా గుర్తించింది.
అయోధ్య రామ మందిర విరాళాల కుంభకోణంలో ప్రముఖుల ప్రమేయం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. వారి పేర్లను బయటపెట్టకపోతే ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అయోధ్య రామ మందిర విరాళాల్లో తీవ్ర దుర్వినియోగం వచ్చిందని ఆరోపణలు రావడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యలో మార్పు లేనప్పటికీ విరాళాలు మొత్తం భారీగా తగ్గిపోయాయి. ఆలయానికి ప్రతి రోజూ రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వచ్చే ఆదాయం లక్ష లోపు పడిపోయింది.
అయోధ్య విరాళాలపై గత కొన్ని రోజులుగా ఏర్పడిన వివాదంపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన మౌనాన్ని వీడారు. ప్రజలు మరో 15 రోజులు ఆగాలని కోరారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలిపెట్టబోమంటూ హామీనిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలైన సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల ద్వంద్వ వైఖరిని, శ్రీరాముని ఉనికిని ప్రశ్నించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రామ భక్తులపై, జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిపై కాల్పులు, లాఠీచార్జి చేయించిన సమాజ్‌వాది పార్టీ ఇప్పుడు తనను తాను రామభక్తులుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. సిట్ దర్యాప్తు అన్ని నిజాలను వెలికి తీస్తుందని యోగి భరోసా ఇచ్చారు.
భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయన్న వివాదం రాజకీయంగా వేడెక్కడంతో రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధాని మోదీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా ఇప్పుడు ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. పైగా ఆయన మారుతున్న ప్రతిస్పందలు కుంభకోణ తీవ్రతను మరింత పెంచుతున్నది. నిధుల కుంభకోణానికి సంబంధించి మీడియా ఆయనను తొలుత ప్రశ్నించినప్పుడు ‘ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణ మాత్రమే నా బాధ్యత తప్ప మరే ఇతర వాటితో నాకు సంబంధం లేదు’ అని పేర్కొన్నారు. అయితే విమర్శలు ఎక్కువ కావడం, దర్యాప్తు తీవ్రత పెరుగడంతో పర్యవేక్షణ, జవాబుదారీతనంలో ఉన్న లోపాలను ఈ వివాదం బయటపెట్టిందని ఆయన అంగీకరించారు. అంతేకాకుండా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్దేశం జరుగకుండానే పలు ముఖ్యమైన కార్యక్రమాలు వలంటీర్ల చేతుల మీదుగానే జవాబుదారీతనం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు.