అయోధ్య: అయోధ్యలోని రామాలయ(Ayodhya Ram temple) నిర్మాణ పనుల్లో మరింత జాప్యం జరుగుతున్నది. ఆలయ శిఖర పనులు మూడు నెలలు ఆలస్యం కానున్నట్లు కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా తెలిపారు. 2025 జూన్‌కు బదులుగా, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు సెప్టెంబర్ 2025 వరకు పూర్తి కానున్నట్లు న్రుపేంద్ర మిశ్రా వెల్లడించారు. వర్కర్ల కొరత, బండల పని పూర్తి కాని నేపథ్యంలో.. ఆలయ శిఖర నిర్మాణంలో ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. సుమారు 200 మంది కార్మికులు షార్టేజ్ ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఆలయంలోని ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాల్సిన బండలకు చెందిన పనులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి లేబర్ షార్టేజ్ కారణమన్నారు. ఆలయ పరిసరాల్లోని ఆడిటోరియం, బౌండరీ ఇంకా నిర్మించాల్సి ఉన్నది. శుక్రవారం అయోధ్యలో జరిగిన రామాలయ బిల్డింగ్ కమిటీ మీటింగ్‌లో మిశ్రా పాల్గొన్నారు.
టెంపుల్ బౌండరీ కోసం 8.5 లక్షల క్యూబిక్ అడుగుల విస్తీర్ణంలో.. బాన్సి పహర్‌పుర్ స్టోన్స్‌ను వాడనున్నట్లు తెలిపారు. అయితే ఆ రాళ్లు అయోధ్యకు వచ్చాయని, కానీ కార్వింగ్ పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్లో సరిగా లేని రాళ్లను తీసి, వాటి స్థానంలో మక్రానా స్టోన్స్ వేయనున్నట్లు తెలిపారు.
ఆలయంలో పొందుపరిచే అన్ని విగ్రహాలను జైపూర్‌లో తయారు చేస్తున్నారు. డిసెంబర్ వరకు ఈ ప్రక్రియ పూర్తి కానున్నది. రామ్‌లల్లాకు చెందిన మరో రెండు విగ్రహాలను కూడా ఆలయ పరిసరాల్లో పెట్టనున్నారు. ఆలయం నుంచి భక్తులు ఎగ్జిట్ అయ్యే దారిని వెడల్పు చేయనున్నట్లు చెప్పారు.