కొత్త కోవెలలో సోమవారం చిన్నారి రామయ్య ఆసీనుల య్యాడు. అభిజిత్ లగ్నంలో 84 సెకన్ల దివ్యముహూర్తాన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అట్టహాసంగా జరిగింది. ధవళవర్ణ శిల్పశోభిత గర్భాలయంలో నీలమేఘశ్యాముడై రామ్‌లల్లా విరాజిల్లాడు. పీఠాధిపతులు, పూజారులతోపాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వెంట రాగా.. భవ్యమందిరంలో రాముడికి ప్రధాని మోదీ తొలి హారతినిచ్చారు. ఆలయంపై హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తుంటే.. రామనామ స్మరణతో సరయూతీరం మార్మోగింది. వేడుకను కనులారా వీక్షించి భక్తకోటి పులకించిపోయింది.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు అయోధ్య ధామం-దేవుడి నిలయం పేరు కలిగిన పుస్తకం, లోహపు దీపం, తులసి మాల, రాముడి పేరు కలిగిన స్కార్ఫ్ కానుకలుగా అందించారు. తులసీ మాల ఉత్తరప్రదేశ్ పర్యాటకం ట్యాగ్‌లైన్ కలిగి ఉంది. ఇవన్నీ ఆలయ గ్రాఫిక్ చిత్రం, అయోధ్య బాలరాముడి ఫొటో కలిగిన సంచిలో పెట్టి ఇచ్చారు. ఈ కానుకలతోపాటు నాలుగు లడ్డూలు, చిప్స్, నువ్వుల మిఠాయి(రేవ్డీ), జీడిపప్పు, ఎండుద్రాక్ష కలిగిన పెట్టెను కూడా అందించారు.
Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 22: కోట్ల మంది శతాబ్దాల కల నెరవేరింది.. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్యకు చేరాడు.. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరాం అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు.. సోమవారం పండితులు నిర్ణయించిన శుభముహూర్తాన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా స్వామి వారికి అలంకరించే వెండి గొడుగు, అరుణ వర్ణ వస్త్రంతో గర్భగుడిలోకి ప్రవేశించిన ప్రధాని మోదీకి వేద పండితులు సంకల్పం చెప్పి 84 సెకన్ల అభిజిత్ ముహూర్త సమయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్ర్తోక్తంగా నిర్వహింపజేశారు. అనంతరం విగ్రహం ముందు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ గవర్నర్ అనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక ప్రధాని మోదీ తన 11 రోజుల దీక్షను విరమించారు. ఆయనకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తీర్థాన్ని తాగించి, ఉపవాస దీక్షను విరమింపజేశారు. కాగా, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో కొత్త శకం ప్రారంభమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో జై సియా రామ్ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన ఆయన మాట్లాడుతూ.. ‘మన రాముడు వచ్చేశాడు. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడిని వేడుకుంటున్నా. జనవరి 22, 2024.. ఇది తేదీ మాత్రమే కాదు. కొత్త కాల చక్రానికి ప్రతీక. వందల ఏండ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఈ శుభ ముహూర్తాన వచ్చే వెయ్యేండ్ల భారత్ కోసం పునాది వేశాం. ఆలయ నిర్మాణంతోనే ఆగిపోకూడదు. పటిష్ట, భారీ ఆధ్యాత్మిక భారత్‌ను నిర్మించాలి.
ఈ రోజు రాముడి భక్తులంతా పట్టరాని సంతోషంలో ఉన్నారు. అయోధ్య ప్రజల ఆనందానికి అవధుల్లేవ్. స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశాం. ఇన్నేండ్లకు మన స్వప్నం సాకారమైంది. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడు. మన రామ్ లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. దివ్యమందిరంలో కొలువుదీరాడు. ఈ శుభ గడియల్లో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక కార్యంలో పాలుపంచుకోవటం గొప్పగా భావిస్తున్నా. ఈ సందర్భాన దేశమంతా దీపావళి జరుపుకుంటున్నది’ అని తెలిపారు. రామమందిర నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, చివరికి న్యాయమే గెలిచిందని వెల్లడించారు.
కుబేర్ తిలలో పూజలు
అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో ఉన్న కుబేర్ తిల శివాలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకొన్నారు. శివలింగానికి జలాభిషేకం చేశారు. అనంతరం జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పురాతన ఆలయంగా పేరొందిన ఈ గుడిని కూడా శ్రీరామ్‌జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అభివృద్ధి చేస్తున్నది.
తరలివచ్చిన ప్రముఖులు
సాధువుల దగ్గరి నుంచి బిజినెస్ టైకూన్ల వరకు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రముఖ వ్యాపార వేత్తలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, రామ్‌చరణ్, కత్రినాకైఫ్, విక్కీ కౌశల్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, రోమిత్శెట్టి, రాజ్‌కుమార్ హిరానీ, ఆయుష్మాన్ ఖురానా, మాధురి దీక్షిత్ దంపతులు సహా అనేక మంది రాముడిని దర్శించుకొన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ప్రతి హిందువు నోటా జై శ్రీరాం.. ప్రతి ఆలయంలో రామ నామ జపం.. ప్రతి ఇల్లూ భక్తి పారవశ్యం.. ఉదయం నుంచే గుడులకు దారులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ఇంటి బయట దీపాల వెలుగులు.. వెరసి దేశమంతా ఆధ్యాత్మిక భావంతో ఓలలాడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రాణప్రతిష్ఠ సమయంలో అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయం, జీలం నది ఒడ్డున ఉన్న హనుమాన్ టెంపుల్ సహా కేరళలోని త్రిస్సూర్ శ్రీరామస్వామి ఆలయం, ఇలా ప్రతి చోటా గుడి గంటల చప్పుళ్లే. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తిరువనంతపురంలోని రమాదేవి ఆలయంలో పూజలో పాల్గొన్నారు. జార్ఖండ్‌లోని 51 వేలకు పైగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జంషెడ్‌పూర్‌లో 18,500 చదరపు అడుగుల్లో రాముడి రంగోలీ వేశారు. ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో శోభాయాత్ర, సుందరకాండ పారాయణం చేశారు. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్, బీహార్.. అన్ని రాష్ర్టాల్లో భక్తులు రామ జపం చేశారు. విదేశాల్లోనూ హిందూ భక్తులు సంబురాలు చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీ వీధుల్లో కాషాయ జెండాలు పట్టి, జైశ్రీరాం అంటూ నినదించారు. దాదాపు 70 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే ప్రతి ఊరిలో జరుగుతున్నట్టే భావించిన భక్తజనం ఆధ్యాత్మికతలో మునిగిపోయింది.