Ayodhya | అయోధ్య, జనవరి 8: అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరుగనున్న రామ మందిర ప్రారంభోత్సవం న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) కానున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎదురుచూస్తున్న రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివిధ భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నివేదించాయి.
ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో రామ మందిర్ థీమ్‌తో నేసిన బనారస్ చీరలకు మస్తు గిరాకీ ఏర్పడింది. దేశ, విదేశాల నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తాము తయారు చేస్తున్న రామ మందిరం థీమ్ చీరలు ఫ్యాషన్ ట్రెండ్ సృష్టించబోతున్నాయని యూపీలోని ముబారక్‌పూర్‌కు చెందిన అనిసూర్ రెహ్మాన్ అనే వ్యాపారి పేర్కొన్నారు. రామ్ దర్బార్ వర్ణన ఉన్న చీరలకు చాలా డిమాండ్ ఉన్నదని పీలి కోఠి ప్రాంతానికి చెందిన మరొకరు తెలిపారు. క్వాలిటీ, డిజైన్‌ను బట్టి ఒక్కో చీర ధర రూ.7 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉన్నదని వ్యాపారులంటున్నారు.
వందలాది ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకుల సాయంతో అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలను అతిథులందరికీ స్వయంగా అందిస్తున్నట్టు అయోధ్య రామాలయ ట్రస్ట్ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయ ట్రస్ట్‌తో పాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విదేశాల్లోని అతిథులకు సైతం స్వయంగా ఆహ్వానాలను అందిస్తున్నారు.