Ayodhya | అయోధ్యలో కొలువుదీరిన రామ్‌లల్లా విగ్రహాన్ని ‘బాలక్ రామ్’గా పిలువనున్నారు. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బాలక్ రామ్’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ప్రతిష్ఠాపన సమయంలో బాల రాముడి విగ్రహాన్ని తొలిసారి చూసిన సమయంలో తాను పులకించిపోయానని.. ఆ సమయంలో కనుల నుంచి నీళ్లు వచ్చాయన్నారు.
ఆ అనుభూతిని తాను వివరించలేనన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. గతంలో తాత్కాలిక మందిరంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని సైతం కొత్త ఆలయంలోని మూలవిరాట్టుకు ముందు ప్రతిష్ఠించారు. బాల రాముడి విగ్రహానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ 51 అంగుళాల విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మూడు బిలియన్ సంవత్సరాలకు చెందిన నల్లరాతిపై విగ్రహాన్ని చెక్కారు.