Ayodhya | ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో రామమందిరానికి సంబంధించిన కొత్త చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గురువారం విడుదల చేసింది. మహాసింహద్వారంతో పాటు ఆలయ ఫొటోలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ విడుదల చేశారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆలయ గ్రౌండ్‌ఫ్లోర్ రెడీ అయ్యింది. అయోధ్యలో నిర్మిస్తున్న మూడు అంతస్తుల రామ మందిరాన్ని సంప్రదాయ నాగర్ శైలిలో నిర్మిస్తున్నారు. ప్రధాన గర్భగుడిలో రామ్‌లాలా విగ్రహం ఉంటుంది. తొలి అంతస్తులో శ్రీరాముడి దర్బార్ ఉంటుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. రామాలయంలో ఐదు మండపాలు ఉంటాయి.
ఇందులో డ్యాన్స్ పెవిలియన్, కలర్ పెవిలియన్, అసెంబ్లీ పెవిలియన్, ప్రార్థన-కీర్తన పెవిలియన్ ఉంటాయి. ఆలయ గోడలు, స్తంభాలపై దేవతా శిల్పాలను అలంకరించారు. భారీగా సింహద్వారం ఉంటుంది. 32 మెట్లు ఎక్కి భక్తులు ఆలయంలోకి రావాల్సి ఉంటుంది. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో గోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలుంటాయి. ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉందని ఆలయ ట్రస్ట్ చెప్పింది.