జగదానంద కారకుడి ప్రాణ ప్రతిష్ఠ దగ్గరపడిన వేళ జగమంతా రామమయమైంది! రామ నామ స్మరణతో అయోధ్యతో పాటు దేశమంతా భక్తిభావంతో నిండిపోయింది. దేశ విదేశాల నుంచి విలువైన, అపురూపమైన కానుకలు రామయ్య సేవ కోసం తరలివచ్చాయి. విద్యుత్తు కాంతులు, సహజ సుందరమైన పుష్పాలంకరణలతో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి అందంగా ముస్తాబైంది.
Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 20: శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అలంకరణలతోపాటు సంప్రదాయం ఉట్టిపడుతూ, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు.
పుష్పాధివాసం పూజల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చక్కెర, పూలను శనివారం బాల రామునికి సమర్పించారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి 81 కలశాల్లో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో బాల రాముని విగ్రహాన్ని, గర్భగుడిని సంప్రోక్షణ చేశారు.
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ పూజలో ‘యజమానులు’గా సోమవారం 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయం నిర్మాణం కోసం అన్ని ప్రాంతాలవారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి యజమానుల ఎంపిక జరిగింది.
రామాలయానికి వెళ్లిన రోజునే దర్శనం, హారతి కోసం బుక్ చేసుకోవచ్చు. అయితే స్లాట్ లభ్యతనుబట్టి పాస్ ఇస్తారు. హారతి షెడ్యూలు సమయానికి 30 నిమిషాల ముందు భక్తులు క్యాంప్ ఆఫీస్ వద్ద హాజరుకావాలి.హారతి పాస్‌లను పొందడం కోసం ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఐడీ కార్డులను చూపించాలి.
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్నవారు తప్పనిసరిగా ఎంట్రీ పాస్‌ను తీసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆహ్వానితులకు వాట్సాప్ ద్వారా ఓ లింక్‌ను పంపించినట్లు తెలిపింది. ఫిజికల్ ఎంట్రీ పాస్ ప్రింట్ చేసి ఇస్తామని తెలిపింది. దీని కోసం ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించాలని చెప్పింది.
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్పెషల్ తెప్లా(చపాతీలు), బాదం మిఠాయిలు, మటర్ కచోరీ వంటివాటిని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్ నాగభూషణం రెడ్డి సమర్పించిన 1,265 కేజీల లడ్డూలను కూడా ప్రసాదంగా అందజేస్తారు.
బుక్ సెల్లర్ మనోజ్ సతి ప్రత్యేక శ్రద్ధతో వాల్మీకి రామాయణం గ్రంథాన్ని ముద్రించి అయోధ్యలో అమ్మకానికి పెట్టారు. దీని ఖరీదు రూ.1.65 లక్షలు అని ఆయన చెప్పారు. దీనిని మూడు పెట్టెల్లో పెట్టి ఇస్తామన్నారు. ఈ పెట్టెలు రామాలయాన్ని పోలి ఉంటాయన్నారు. ఫ్రాన్స్‌లో తయారైన కాగితం, జపాన్ నుంచి తెప్పించిన సిరాతో దీనిని ముద్రించామన్నారు. అమెరికన్
వాల్నట్ వుడ్, కుంకుమ పువ్వుతో డిజైన్ చేశామన్నారు. 45 కేజీల బరువు గల ఈ పుస్తకం 400 సంవత్సరాలకుపైగా మన్నుతుందని చెప్పారు.
అయోధ్యలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు సైతం ఆధ్యాత్మిక భావాన్ని పంచుతున్నాయి. రామాలయం చిత్రాలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. రామ్ పథ్‌లో గురువారం ప్రారంభమైన ఓ బ్యాంకును రామ జన్మభూమి శాఖగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కూడా తమ విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, కేలండర్లు, సైనేజెస్లో రామాలయం బొమ్మను ముద్రించాయి. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన పోస్టర్లో ‘ప్రభు శ్రీరాముని పావన నగరానికి స్వాగతం’ అని రాశారు. సాధారణ ప్రజానీకం కూడా తమ మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లుగా రాముని పాటలనే పెట్టుకుంటున్నారు.
దర్శనం, హారతి సమయాలు మేలుకొలుపు, శృంగార హారతి: ఉదయం 6.30 గంటలకు
భోగ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు
సంధ్యా హారతి : సాయంత్రం 7.30 గంటలకు
దర్శన వేళలు: ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు