Ayodhya | అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశంలో రామజన్మభూమి పరిధిలోని ఆలయంతో పాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టులపై సమీక్షించింది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు గర్భాలయంలో రాంలాలా
దర్శనాలు ఉండవని ట్రస్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ట, వీఐపీల రాక నేపథ్యంలో మూడురోజుల
పాటు దర్శనాలను ఉండవని తెలుస్తున్నది. ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా మాట్లాడుతూ గర్భగుడి95 శాతం
సిద్ధమైందని, ఈ నెల 23 నుంచి భక్తులు అయోధ్యకు వచ్చి రామ్‌లాలా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి
చేశారు.
అయోధ్య రామాలయంలో ప్రారంభోత్సవం నేపథ్యంలో 6500 మంది అతిథులకు ట్రస్ట్ బోర్డు
ఆహ్వానిస్తున్నది. రామాలయంలో జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కార్యక్రమం వేడుకగా జరుగనున్నది. సమయం దగ్గరపడుతుండడంతో ఆలయ నిర్మాణ
పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ సింహద్వార నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ద్వారం
వద్ద విగ్రహాలను ఏర్పాటు చేశారు. అన్ని మండపాల ఫోర్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఆలయంలోని అన్ని
స్తంభాలను శుభ్రం చేస్తుండగా.. ఫ్లోర్‌ను పాలిష్ చేయనున్నారు.
ఇప్పటికే విద్యుత్ పనులన్నీ పూర్తి చేశారు. కార్యక్రమం రోజున రద్దీని నియంత్రించేందుకు ఉత్తరం వైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి, ప్రాకారానికి మధ్య 27 మీటర్ల స్థలంలో రాతి పనులు కొనసాగుతున్నాయి. భక్తులు రాకపోకలు సాగించే కాంప్లెక్స్‌లోని అన్ని మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఒక్కరోజులో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రామ మందిరంలో రోజులో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది దర్శనం చేసుకోవచ్చని డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.
ఆలయ భద్రత అత్యున్నత ప్రమాణాలతో ఉంటుందని, అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. దర్శనానికి నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నాటికి స్కానర్లు, స్క్రీనింగ్ మిషనరీ, 25 వరకు సెక్యూరిటీ డివైజెస్ అమర్చే పని పూర్తవుతుందని వివరించారు. సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ఆలయ నిర్మాణ ఇన్చార్జి గోపాల్ జీ రావు, డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్, సాహితీవేత్త యతీంద్ర మిశ్రా, కార్యనిర్వాహక సంస్థ ఇంజనీర్లు పాల్గొన్నారు.