Wheat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.53 లక్షల టన్నులుగా ఉన్నట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), స్టేట్ ఫుడ్ ఏజెన్సీల గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2017 తర్వాత ఈ స్థాయిలో నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి. గోధుమ నిల్వల కనీస బఫర్ స్థాయిని 138 లక్షల టన్నులుగా నిర్ణయించారు.
ప్రస్తుతం బఫర్ స్థాయి కంటే గోధుమల నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్, ఇరాన్-పాక్ దేశాల మధ్య కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు పలు దేశాల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతోపాటు ద్రవ్యోల్బణ భయాలు ఉండనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో గోధుమలకు కొరత ఏర్పడితే, అది ఆహార సంక్షోభానికి దారితీయొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వెంటనే గోధుమల నిల్వలను పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.