థానే: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి జాడ కోసం ముమ్మరంగా గాలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వివరాలు తెలుసుకుని.. శనివారం నవీ ముంబైలోని దిగాలో అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. థానేలో శుక్రవారం ఉదయం 22 ఏండ్ల యువతి ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక ఆటో డ్రైవర్ ఆటో ఆపుకుని కూర్చున్నాడు.
యువతి తన సమీపంలోకి రాగానే ఆమెను ఉద్దేశించి బూతు వ్యాఖ్యలు చేశాడు. ఆ మాటలు విన్న యువతి ఏమన్నావంటూ ఆటో డ్రైవర్ను నిలదీసింది. దాంతో ఆటో డ్రైవర్ ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఆమెపట్ల మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి గట్టిగా అరవడంతో పారిపోయేందుకు ఆటోను స్టార్ట్ చేశాడు. వెళ్లనివ్వకుండా యువతి అతని చేయి పట్టుకోగా నిందుతుడు ఆటోను మూవ్ చేశాడు. దాదాపు అరకిలోమీటర్ దూరం వరకు ఆమెను ఆటోతో ఈడ్చుకెళ్లాడు. అనంతరం యువతి పట్టు కోల్పోవడంతో పారిపోయాడు.
ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వివరాలు రాబట్టారు. నిందితుడు నవీ ముంబైలోని దిగాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. థానే నగర్ పోలీస్స్టేషన్ నుంచి ఒక బృందాన్ని అక్కడికి పంపి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.