న్యూఢిల్లీ, నవంబర్ 1: కరోనా (Corona) కల్లోలం, దాని దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో నివ్వెరపోయే నిజం బయటపడింది. గర్భిణులుగా ఉన్నప్పుడు కొవిడ్ సోకితే.. అలాంటి మహిళలకు పుట్టిన పిల్లల్లో బుద్ధి మాంద్యం(Autism) లక్షణాలు గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పిల్లల ఎదుగుదల, మాటల్లో అస్పష్టత, ఆలోచన శక్తి లేకపోవడం వంటి ప్రభావాలను కనుగొన్నట్టు తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగ్మాన్లోని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన వివరాలు వెల్లడించారు.
కరోనా వైరస్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల పిండంలోని మెదడు అభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. పరిశోధన ఫలితాల నివేదికను అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ మ్యాగజైన్లో ప్రచురించారు. కరోనా విస్తృత వ్యాప్తిలో ఉన్న 2020 మార్చి నుంచి 2021 మే మధ్య జరిగిన ప్రసవాలు, ప్రస్తుతం ఆ పిల్లల్లో కనిపిస్తున్న లక్షణాల ఆధారంగా నివేదికను తయారు చేసినట్టు తెలిపారు. పరిశోధనలో భాగంగా 18,124 ప్రసవాలను పరిశీలించినట్టు చెప్పారు.