Blackout in Ambala : హర్యానా రాష్ట్రం (Haryana state) లోని అంబాలా (Ambala).. మన దేశానికి సంబంధించిన కీలక ఎయిర్‌ఫోర్స్ బేస్. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు ఈ రాత్రి నుంచి అంబాలాలో పూర్తిస్థాయి బ్లాకౌట్ ప్రకటించారు. ఈ మేరకు అంబాలా జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. రాత్రి వేళల్లో అంబాలాలో బ్లాకౌట్ విధిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రజల భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా అంబాలాలో పూర్తిస్థాయి బ్లాకౌట్ ప్రకటించినట్లు అక్కడి డిప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తోమర్ తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ రాత్రి నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అవుట్డోర్ లైట్లు, బిల్‌బోర్డులు, స్ట్రీట్ లైట్లు తదితర వాటి కోసం ఇన్వర్టర్లు, జనరేటర్లు సహా ఏ ఇతర పవర్ బ్యాకప్ డివైజ్‌లను వినియోగించవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇండ్లలో వినియోగించే లైట్ల వెలుతురు కూడా బయటికి కనిపించకుండా మందపాటి కర్టెన్లను వినియోగించాలని అజయ్ సింగ్ సూచించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని హెచ్చరించారు.