
హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కొవిడ్ మృతుల వివరాల నమోదుకు వీలుగా డెత్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపింది. దీనికి సంబంధించి జీవో 151, జీవో 1 జారీ అయినట్టు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంతోష్‌కుమార్ కోర్టుకు వివరించారు. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు కావాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఆమోదించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్ మరణాల గురించి ఆడిట్ కమిటీ వేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు లేవని, ఆడిట్ కమిటీలు చట్ట నిబంధనలకు లోబడి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం ఆడిట్ కమిటీని ఏర్పాటు చేశామని, కౌంటర్ దాఖలు చేస్తామని చెప్తున్న దశలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని తెలిపింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.