Corporate Mitra | దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME)లకు తక్కువ ఖర్చుతో వృత్తిపరమైన సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పథకం ‘కార్పొరేట్ మిత్ర’. దీని ద్వారా శిక్షణ పొందిన నిపుణులు చిన్న వ్యాపారాలకు ఆర్థిక, అకౌంటింగ్, చట్టపరమైన విషయాల్లో సహాయం చేస్తారు.
ఉద్యోగాల సాధన దిశగా యువతను ప్రోత్సహించడానికి, ఎంఎస్ఎంఈ (MSME) రంగ బలోపేతానికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన పారా-ప్రొఫెషనల్స్ పూల్‌ను తయారుచేసే లక్ష్యంతో ‘కార్పొరేట్ మిత్ర’ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది.
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ICAI, ICSI, ICMAI ల అకాడమిక్ భాగస్వామ్యంతో, IIT మద్రాస్ (Swayam Plus) ద్వారా ఈ కోర్సును అందిస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎంఎస్ఎంఈ సంస్థల్లో అకౌంటింగ్, ట్యాక్సేషన్, బ్యాంకింగ్, లీగల్ వంటి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ముఖ్యమైన తేదీలు
దీనికి దరఖాస్తులు జూలై 15 నుంచి ప్రారంభమయ్యాయి. జూలై 31 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. మొదటి బ్యాచ్ కింద దేశవ్యాప్తంగా కేవలం 2,000 మంది అభ్యర్థులను మాత్రమే ‘మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత (First-Come, First-Served)’ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
అర్హతలు (Eligibility Criteria)
దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయస్సు 30 సంవత్సరాల్లోపు ఉండాలి. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు లేదా ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వివరాలు (Course Details)
మొత్తం 12 నెలల (One Year) వ్యవధి గల ఈ కోర్సును రెండు భాగాలుగా విభజించారు. మొదటి 6 నెలలు (అకాడమిక్ లెర్నింగ్) స్వయం ప్లస్ (Swayam Plus) పోర్టల్ ద్వారా 150 గంటల ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. తదుపరి 6 నెలలు (ఆన్-ది-జాబ్ ట్రైనింగ్) ప్రముఖ ప్రొఫెషనల్ సంస్థల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే అవకాశం కల్పిస్తారు. దీని ద్వారా అభ్యర్థులు స్టైపెండ్ కూడా పొందవచ్చు.
శిక్షణ అందించే ప్రధాన రంగాలు (Areas of Support)
ఈ కోర్సులో అభ్యర్థులకు కింది అంశాలపై ప్రాక్టికల్, థియరిటికల్ నాలెడ్జ్ అందిస్తారు. అకౌంటింగ్ (Accounting), ట్యాక్సేషన్ (Taxation – GST, Income Tax మొదలైనవి), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, లీగల్, సెక్రటేరియల్ సేవలు (Legal & Secretarial), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్.
సాధారణ అభ్యర్థులకు ఫీజు రూ. 3,000 + GST, మహిళా అభ్యర్థులు, ఈశాన్య రాష్ట్రాలు (North-Eastern States), హిమాలయ ప్రాంతాల అభ్యర్థులకు, అండమాన్, నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాల వారికి 50 శాతం ఫీజు రాయితీ (₹1,500 + GST మాత్రమే) ఉంటుంది. ఇతర వివరాల కోసం వెబ్సైట్ https:swayamplus.education.gov.in/courses/corporate-mitra లో చూడండి.