న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న అట్టారి-వాఘా బోర్డర్(Attari-Wagah Border)ను గురువారం పూర్తిగా మూసివేశారు. గడిచిన వారం రోజులు బోర్డర్ రూట్లో జనం రెండు దేశాలకు ప్రయాణించారు. షార్ట్ టర్మ్ వీసాలున్న పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి అట్టారి-వాఘా బోర్డర్ క్రాసింగ్ పాయింట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. గురువారం రోజున ఒక్కరు కూడా వాఘా బోర్డర్ దాటినట్లు ఆనవాళ్లు లేవు.
బుధవారం రోజున 125 మంది పాకిస్థానీలు ఇండియా దాటి వెళ్లారు. దీంతో గత ఏడు రోజుల్లో దేశం విడిచి వెళ్లిన పాకిస్తానీయుల సంఖ్య 811కు చేరుకున్నది. పాకిస్థాన్ వీసాలు ఉన్న 15 మంది భారతీయ పౌరులు కూడా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. దీంతో ఆ సంఖ్య 23కు చేరుకున్నది. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లో దాడి జరిగిన తర్వాత పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇండియాను వీడి వెళ్లే సార్క్ వీసాదారులకు ఏప్రిల్ 26, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు డెడ్‌లైన్ విధించారు. మరో ఇతర 12 కేటగిరీల వీసాలు కలిగి ఉన్న ప్రజలకు డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 27 వరకు పెట్టారు.