న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్పులు జరిగాయి. చికిత్స పొందుతున్న ఒక రోగి ఈ కాల్పుల్లో మరణించాడు. (Patient Shot Dead) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఖజూరి ఖాస్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల రియాజుద్దీన్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. జూన్ 23న గురు తేగ్ బహదూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. మూడో అంతస్తులోని వార్డులో చికిత్స పొందుతున్నాడు.
కాగా, ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో వార్డులోని బెడ్‌పై ఉన్న రియాజుద్దీన్‌కు ఒక డాక్టర్ కట్టుకడుతున్నారు. ఇంతలో 18 ఏళ్ల యువకుడు అతడి వద్దకు వచ్చాడు. వెంట తెచ్చిన గన్‌తో రియాజుద్దీన్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇది చూసి ఆ వార్డులోని రోగులు, వైద్య సిబ్బంది భయాందోళన చెందారు.
మరోవైపు బుల్లెట్ గాయాలైన రియాజుద్దీన్ బెడ్‌పై కుప్పకూలాడు. రక్తం మడుగులో మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను సమీక్షిస్తామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కాల్పుల సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.