ఇంఫాల్, జూలై 22: ఇంటర్నెట్పై నిషేధం విధించి మణిపూర్‌లో చోటుచేసుకొన్న దారుణాలను కప్పిపుచ్చాలని కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు చేసిన కుట్రలు ఎంతో కాలం కొనసాగలేదు. ఇంటర్నెట్పై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తేయాలని మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలతో మణిపూర్‌లో ఆందోళనల మాటున మానవత్వాన్ని మంటగలిపిన అనేక ఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన.. యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేయగా, మరిన్ని ఘటనలు సోషల్ మీడియాతోపాటు పలు ఇతర మార్గాల్లో బయటి ప్రపంచానికి వెల్లడవుతున్నాయి. ఇందులో మహిళలపై లైంగిక దాడులు, అఘాయిత్యాల తర్వాత హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మరో ఘటనలో ఓ మహిళను బట్టలు విప్పి, సజీవంగా దహనం చేసిన దారుణం చోటుచేసుకొన్నది.
నగ్న ఊరేగింపు ఘటన రోజునే
మహిళల నగ్న ఊరేగింపు, సామూహిక లైంగిక దాడి లాంటివి ఇతర చోట్ల కూడా మరికొన్ని జరిగినట్టు తెలిపే వివరాలు బయటకు వస్తున్నాయి. నగ్న ఊరేగింపు జరిగిన మే 4వ తేదీనే.. మరో ఇద్దరు యువతులపై సామూహిక లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తున్నది. ఇంఫాల్ ఈస్టు ప్రాంతంలోని ఓ కారు వాషింగ్ సెంటర్లో పనిచేసే ఇద్దరు యువతులపై కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి, చంపేశారని బాధిత యువతుల్లో ఒకరి తల్లి, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 6న, ఇంఫాల్ ఈస్టులో ఓ 45 ఏండ్ల మహిళ బట్టలు ఊడదీసి, ఆమె శరీరానికి నిప్పటించిన దారుణ ఘటన చోటుచేసుకొన్నది. కాలిపోయిన మృతదేహానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎన్నెన్నో క్రూరమైన నేరాలు..
మే 3 తర్వాత తమ కమ్యూనిటీకి చెందిన పలువురు మహిళలపై లైంగిక దాడులు, హత్యలకు సంబంధించిన వివరాలను మణిపూర్ కుకీ-జో కమ్యూనిటీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇంఫాల్‌లోని ఉరిపోక్‌లో వారి నివాసంలో కుకీ-జో కమ్యూనిటీకి చెందిన ఓ తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. చెకాస్కు చెందిన కుకీ మహిళలను కిడ్నాప్ చేసి, తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారు. పోరంపాట్లో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులను వీధుల్లో హత్య చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇంఫాల్ నడిబొడ్డున, మానసిక స్థితి సరిగా లేని ఓ కుకీ మహిళను దుండుగులు నిర్దాక్షిణ్యంగా చంపేశారని అందులో తెలిపారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో ఏడుగురు అధికార బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
రాష్ట్రపతి పాలన విధించాలి
మణిపూర్ అంశంపై కేంద్ర వైఖరికి నిరసనగా విపక్షాలు సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టే యోచనలో ఉన్నాయి. మణిపూర్‌లో శాంతి నెలకొనేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ముర్ముకు జార్ఖండ్ సీఎం సొరేన్ లేఖ రాశారు. మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే.. సీఎం బీరేన్‌సింగ్‌ను తొలగించి, రాష్ట్రపతి పాలన విధించడమే ఏకైన మార్గమని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు నగ్న ఊరేగింపు ఘటనలో పోలీసులు శనివారంతో ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒక జువైనల్ ఉన్నాడు.
మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మణిపూర్‌లో అమానుష ఘటనలు జరుగుతున్నాయని శివసేన(ఉద్ధవ్‌వర్గం) ఆరోపించింది. ‘మణిపూర్ ఫైల్స్’ పేరుతో సినిమా తీసి.. దేశ ప్రజలందరికీ అక్కడి పరిస్థితులు తెలియజేయాల్సిన అవసరముందని పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్ లో అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ప్రధాని మోదీ నోరు విప్పారని, తాష్కెంట్ ఫైల్స్, ద కేరళ స్టోరీ, ద కశ్మీర్ ఫైల్స్.. అంటూ సినిమాలు తీస్తున్న వ్యక్తులు.. మణిపూర్‌లో హింసపైనా సినిమా తీయాలని పేర్కొన్నది. మణిపూర్‌లో బీజేపీయేతర ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి ఉండేదని, అక్కడ 60వేల మంది కేంద్ర బలగాల్ని మోహరించినా, పరిస్థితిని అదుపులోకి తేలేకపోయారని విమర్శించింది. ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్లక్ష్యానికి ఈ దారుణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నది.