బాలియా (యూపీ), సెప్టెంబర్ 3: అంటరానితనాన్ని రూపుమాపడానికి ఉద్యమించిన దేశం ఇది.. అందరూ సమానమేనంటూ రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. కానీ బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో దళితులు ఇంకా వివక్షకు గురవుతున్నారు. కేవలం బైక్‌ను ముట్టుకున్నందుకు దళిత విద్యార్థిని రాడ్డుతో కొట్టాడు ఉపాధ్యాయుడు. ఈ ఘటన శుక్రవారం బాలియా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థి ఉపాధ్యాయుడి బైక్‌ను ముట్టుకున్నాడు. ఇది గమనించిన ఉపాధ్యాయుడు కృష్ణమోహన్ శర్మ ఆ విద్యార్థిని తరగతి గదిలో బందించాడు. అనంతరం ఇనుపరాడ్డుతో చితకబాదాడు. చీపురు కట్టతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. రెండు చేతులతో గొంతు నులిమాడు. దీంతో ఆ విద్యార్థి స్పృహ కోల్పోయాడు. గమనించిన తోటి ఉపాధ్యాయులు గదిలో నుంచి విద్యార్థిని బయటికి తీసుకొచ్చి కాపాడారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి కుటుంబసభ్యులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ అధికారులు.. ఉపాధ్యాయుడు కృష్ణమోహన్ శర్మను సస్పెండ్ చేశారు.
జైపూర్, సెప్టెంబర్ 3: కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లోనూ దళితులపై వివక్ష కొనసాగుతున్నది. దళిత విద్యార్థినులు వడ్డించిన అన్నం తినవద్దని విద్యార్థులను వంటమనిషి ఆదేశించాడు. ఈ ఘటన ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్నది. రోజువారీలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే విద్యార్థులకు ఇద్దరు దళిత బాలికలు భోజనాన్ని వడ్డించారు. ఇది గమనించిన వంటమనిషి దళితులు వడ్డించిన అన్నం తినొద్దని, బయటపడేయాలని విద్యార్థులకు సూచించాడు. దీంతో విద్యార్థులు అన్నంను పడేశారు. ఆ ఇద్దరు బాలికలు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారంతా పాఠశాల వద్ద ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంటమనిషిని అరెస్టు చేశారు.