Train Accident | మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖజరహో-ఉదయ్‌పూర్ రైలులో మొబైల్ పేలి మంటలు చెలరేగాయనే వదంతుల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో కాలిపోతామేమో అన్న భయంతో చైన్ లాగి ట్రైన్లో నుంచి బయటకు దూకడంతో, పక్క ట్రాక్‌పై వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా, రాజస్థాన్‌లోని ధౌల్పూర్ మధ్య ఉన్న హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఖజరహో-ఉదయ్‌పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ పేలిందని ప్రచారం జరిగింది. పేలుడు కారణంగా రైలుకు మంటలు అంటుకున్నాయని భావించిన పలువురు ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇంతలో ఓ ప్రయాణికుడు అలారం చైన్ లాగాడు. దీంతో రైలు మధ్యలోనే ఆగిపోయింది.
అప్పటికే అగ్ని ప్రమాదం జరిగిందన్న భయంలో ఉన్న పలువురు ప్రయాణికులు.. రైలు ఆగగానే ముందు వెనుక ఆలోచించకుండా బయటకు దూకేశారు. పక్క ట్రాక్‌పై పరుగులు పెట్టారు. అయితే అదే సమయంలో పక్క ట్రాక్‌పై ఆగ్రా వైపు నుంచి మురైనా వెళ్తున్న ఫిరోజ్‌పూర్-సీవని పాతాళ్కోట్ ఎక్స్‌ప్రెస్ వేగంగా పక్క ట్రాక్‌పై దూసుకొచ్చింది. ట్రాక్‌పై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆఫ్రీన్(35), ఆమె నాలుగేళ్ల కుమారుడు అసద్ ఖాన్, ఆగ్రా జిల్లా రుసక్తాకు చెందిన శకుంతల (60), రాజస్థాన్‌లోని భిక్కనేర్ జిల్లాకు చెందిన వీర్మాదేవి(60) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మొబైల్ పేలుడు పుకారు ఎలా వ్యాపించింది, చైన్ లాగింది ఎవరు అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.