న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతోపాటు ఆప్ నేతలు గోపాల్‌రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్, అహ్లావత్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆతిశీ ఢిల్లీకి ఎనిమిదో ముఖ్యమంత్రి కాగా, అత్యంత పిన్న వయస్కురాలైన సీఎంగా ఆమె రికార్డులకెక్కారు.
అలాగే, ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన మూడో మహిళగానూ మరో ఘనత సాధించారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆతిశీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆతిశీ 5 నెలలు మాత్రమే ఢిల్లీ సీఎంగా ఉండనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చేసిన తొలి ప్రసంగంలో ఆతిశీ తన మెంటార్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు మన ముందున్న ఏకైక కార్యం కేజ్రీవాల్‌ను తిరిగి అధికారంలోకి తేవడమేనని అన్నారు. ‘ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశా. అయితే సీఎంగా కేజ్రీవాల్ లేకపోవడం మా అందరినీ ఉద్విగ్న పరిచింది. మేమందరం ప్రస్తుతం చేయాల్సిన ఏకైక పని కేజ్రీవాల్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే’ అని ఆతిశీ అన్నారు.