శ్రీనగర్ : ఈ నెల 14న కురిసిన కుంభవృష్టి నుంచి జమ్ముకశ్మీరులోని కిష్టార్ తేరుకోకముందే, శని-ఆదివారాల మధ్య రాత్రి కథువా జిల్లాలో మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) సంభవించింది. దీంతో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. కథువా జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజేశ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు, పోలీసులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. జోధ్ ఘాటీ గ్రామానికి ఇతర ప్రాంతాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. జంగ్లోటే ప్రాంతంలో కొండచరియ విరిగిపడటంతో ఇద్దరు మరణించారు. జోధ్ ఘాటీలో గాయపడిన ఐదుగురిని దవాఖానకు తరలించినట్లు అధికారులు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో బగర్డ్, చాంగ్డా, దిల్వాన్-హుట్లి గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి.
భారీ వర్షాలు కురియడంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి, ఉఝ్ నది ప్రమాద స్థాయికి సమీపంలో ప్రవహిస్తున్నది. చెరువులు, కుంటలు, కాలువలకు దూరంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. కుంభవృష్టి వల్ల ప్రాణ నష్టం సంభవించడంపై జమ్ముకశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియజేశానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు ఆర్థిక సాయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. కిష్టార్లో ఈ నెల 14న కురిసిన కుంభవృష్టి వల్ల దాదాపు 60 మంది మరణించారు, అనేక మంది గల్లంతయ్యారు.