న్యూఢిల్లీ: మతాన్ని, రాజకీయాలను కలపవద్దు అని, కనీసం దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరుమల లడ్డూ(Tirupati Laddoo) వివాదంపై దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లడ్డూలో జంతు కొవ్వు వాడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఇవాళ సుప్రీం విచారించింది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్లపై వాదనలు చేపట్టింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు నెయ్యిని వాడినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్రమైన రీతిలో ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. అలాంటి సందర్భంలో సీఎం చంద్రబాబు ఎలా పబ్లిక్‌గా ప్రకటన చేశారని కోర్టు ప్రశ్నించింది.
జస్టిస్ గవాయి మాట్లాడుతూ.. జంతు కొవ్వును వాడినట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కోర్టు సీఎం చంద్రబాబును ప్రశ్నించింది. నివేదికల ప్రకారమే నెయ్యి శ్యాంపిళ్లను తిరస్కరించినట్లు జస్టిస్ విశ్వనాథన్ చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఎందుకు మీరు మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చిందని కోర్టు అడిగింది. విచారణకు ఆదేశించిన మీరే, ఎందుకు మీడియా ముందు ఆరోపణలు చేశారని ఏపీ సీఎంను జడ్జీ ప్రశ్నించారు. అందుకే కనీసం దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టాలని కోర్టు అభిప్రాయపడింది.
తిరుమల లడ్డూలో చేప నూనె, బీఫ్, పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్‌కు చెందిన ఓ ల్యాబ్ తన రిపోర్టులో పేర్కొన్నది. దీంతో ఈ వివాదం తీవ్రతరమైంది. లడ్డూల తయారీ కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాణ్యత లేని నెయ్యిని వాడినట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపనలు చేసిన విషయం తెలిసిందే.