న్యూఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Elections Results) ప్రారంభమైంది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కౌంట్ చేస్తారు. ఉదయం 11 గంటల వరకు ఫలితాలపై స్పష్టత రానున్నది.
హర్యానాలో ఫలితాలపై రాజకీయ పార్టీలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, పదేండ్ల తర్వాత అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఈ నెల 5న ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. 67.09 శాతం పోలింగ్ నమోదయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాల్సి ఉంటుంది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీచేశారు.
ఇక జమ్ము కశ్మీర్లో 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో జరగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. విజయంపై బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటములు ధీమాగా ఉన్నాయి. అయితే ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వరని, హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కాగా, కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 90 స్థానాలకు మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, 63.45 శాతం పోలింగ్ నమోదయింది. లెఫ్టినెంట్ గవర్నర్ నలుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేసే అవకాశం ఉన్నది. దీంతో మెజార్టీ మార్క్ 48కి చేరిన పార్టీలే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది.