Assembly Elections : అస్సాం (Assam), కేరళ (Kerala), పుదుచ్చేరి (Puduccheri) అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంట వరకు అస్సాంలో 75.91 శాతం, కేరళలో 62.71 శాతం, పుదుచ్చేరిలో 72.40 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో అయితే మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 62.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
దాంతో ఈసారి కేరళలో పోలింగ్ శాతం సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తుది ఓటింగ్ శాతం ‘80%’ మార్కును దాటుతుందా.. లేదా..? అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 1987 తర్వాత కేరళలో పోలింగ్ ఎన్నడూ 80 శాతం దాటలేదు. ఈ క్రమంలో కేరళ ఎన్నికల ప్రధాన అధికారి రతన్ యు ఖేల్కర్ ఈసారి 85 శాతం పోలింగ్‌ను లక్ష్యంగా నిర్దేశించారు. అయితే 1960లో నమోదైన 85 శాతం పోలింగే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డుగా ఉన్నది.
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ సరళిలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. పినరయి విజయన్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2016 ఎన్నికల్లో 77 శాతం, ఆయన రెండోసారి గెలిచిన 2021లో 75 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఉదయం నుంచే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. సాధారణంగా కేరళలో పోలింగ్ శాతం పెరిగితే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుందనే దానిపై ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్లలో పెరిగిన చైతన్యం, హోరాహోరీగా సాగిన ప్రచారమే ఈ భారీ ఓటింగ్‌కు కారణంగా తెలుస్తోంది.