Assembly by-elections : దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. మరో స్థానంలో కూడా టీఎంసీనే ఆధిక్యంలో ఉన్నది.
రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బగ్దా నియోజకవర్గాల్లో టీఎంసీ విజయం సాధించింది. మణిక్తలా నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) లో మూడు స్థానాల్లో ఎన్నికలు జరగగా రెండు చోట్ల కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ గెలిచాయి. దేహ్రా, నాలాగఢ్లలో కాంగ్రెస్ గెలువగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగ్లౌర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది. పంజాబ్‌లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక నియోజకవర్గం జలంధర్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. తమిళనాడులో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానం విక్రవందిలో అధికార డీఎంకే ఆధిక్యంలో ఉన్నది. మధ్యప్రదేశ్‌లోని అమర్వారలో బీజేపీ, బీహార్‌లోని రూపౌలీలో స్వతంత్య్ర అభ్యర్థి ఆధిక్యంతో కొనసాగుతున్నారు.