ఓ ఇద్దరు చిన్నారులకు పాల దంతాలు ఊడిపోయాయి. దీంతో తమకు ఇష్టమైన ఫుడ్‌ను వారు తినలేకపోతున్నారు. తమకు దంతాలు సమకూర్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మకు ఆ చిన్నారులు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గువహటికి చెందిన రాయిసా రౌజా అహ్మద్(6), ఆర్యన్ అహ్మద్(5) కు పాలదంతాలు ఊడిపోవడంతో.. ఇష్టమైన ఫుడ్‌ను తినలేక ఇబ్బందులు పడుతున్నారు. ఊడిపోయిన దంతాల స్థానంలో కొత్త దంతాలు రావడం లేదు. దీంతో వారికి ఒక ఆలోచన వచ్చింది. తమ బాధను ఏకంగా మోదీకి చెప్పాలనుకున్నారు. దాంతో మోదీతో పాటు అసోం సీఎంకు లేఖ రాశారు. మా సమస్యపై ఏదో ఒక చర్య తీసుకోవాలని, దంతాలను సమకూర్చాలని లేఖలో కోరారు. ఈ లేఖలను ఆ పిల్లల మేనమామ ముక్తర్ అహ్మద్ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.