Shah Rukh Khan | షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమా ప్రదర్శించే అసోంలోని నారేంగి థియేటర్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. పఠాన్ సినిమాను ఇక్కడ విడుదల చేయడానికి వీలులేదని నినదించారు. మరోవైపు షారుఖ్‌ఖాన్ అభిమానులు సినిమా విడుదల చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఇరువర్గాల ఆందోళన మధ్య ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఈ విషయమై మీడియా ప్రతినిధులు శనివారం అసోం సీఎం హేమంత బిస్వ శర్మను ప్రశ్నించగా.. షారుఖ్ ఖాన్ ఎవరు..? అంటూ ఎదురు ప్రశ్నించారు. షారుఖ్‌ఖాన్ గురించి గానీ, ఆయన నటించిన సినిమా గురించి గానీ తనకు ఏమాత్రం తెలియదని సమాధానమిచ్చారు. బాలీవుడ్ నుంచి చాలా మంది ఈ సమస్య గురించి తనకు ఫోన్ చేసినా.. షారుఖ్‌ఖాన్ మాత్రం చేయలేదన్నారు. ఖాన్ ఫోన్ చేసి విషయం చెప్తే పరిశీలిస్తానని చెప్పారు.
మిస్టర్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అని మీడియా ప్రతినిధులు చెప్పగా.. ఈ రాష్ట్ర ప్రజలు అస్సామీల గురించి మాత్రమే ఆందోళన చెందాలని, హిందీ చిత్రాల గురించి కాదని అన్నారు. దివంగత నిపోన్ గోస్వామి దర్శకత్వం వహించిన అస్సామీ సినిమా ‘డాక్టర్ బెజ్బరువా – పార్ట్ 2’ త్వరలో విడుదల కానున్నదని, అసోం ప్రజలు ఈ సినిమా చూడాలని శర్మ సూచించారు. శాంతిభద్రతలను ఉల్లంఘించేవారిపై చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఎం హేమంత బిస్వ శర్మ స్పష్టం చేశారు.
షారుఖ్‌ఖాన్, దీపికీ పదుకొనే నటించిన ఈ సినిమాపై విశ్వహిందూ పరిషత్‌తో పాటు పలు హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25 న దేశవ్యాప్తంగా విడుదల కానున్నది.