(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : బీజేపీపాలిత అస్సాంలో ‘గో’కుంభకోణం వెలుగు చూసింది. పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో 2021లో తీసుకొచ్చిన ‘గోరుఖుటీ బహూముఖి కృషి ప్రకల్ప (జీబీకేపీ)’ (గోవుల పంపిణీ స్కీమ్) అక్రమాలకు అడ్డాగా మారింది. నిజమైన లబ్ధిదారులైన రైతులకు ఇవ్వాల్సిన మేలిరకం గిర్ ఆవులను స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పంచుకొన్నారు.
ఈ మేరకు సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ద్వారా తెలిసొచ్చింది. కొన్ని ఆవులు మరణించినట్టు ఆర్టీఐ కార్యకర్తలు చెప్తున్నారు. రైతులు కాకపోయినా బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు నకిలీ రైతులుగా అవతారమెత్తి లక్షల రూపాయల విలువైన గోవులను తీసుకొన్నారని పేర్కొన్నారు.