లక్నో: ఉత్తరప్రదేశ్ సంభల్‌లోని మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు రక్షిత వారసత్వ కట్టడమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తెలిపింది. (Sambhal Masjid) ఈ నేపథ్యంలో రక్షణ కోసం ఆ మసీదుపై నియంత్రణ, నిర్వహణను తమకు అప్పగించాలని కోర్టును కోరింది. శుక్రవారం సంభల్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఆ మసీదులో సర్వే జరుపాలన్న కోర్టు ఆదేశంపై ప్రతివాదనను సమర్పించింది. ఏఎస్ఐ తరపు న్యాయవాది విష్ణు శర్మ దీని గురించి మీడియాతో మాట్లాడారు. మసీదు సర్వే, స్థల పరిశీలనను మసీదు నిర్వహణ కమిటీ, స్థానికులు అడ్డుకున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా మసీదు మెట్లపై స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు గురించి 2018 జనవరి 19న మసీదు కమిటీపై కేసు నమోదైన సంగతిని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
కాగా, సంభల్‌లోని మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) 1920లో ప్రకటించిందని న్యాయవాది విష్ణు శర్మ తెలిపారు. దీంతో ఆ నిబంధనల మేరకు ఏఎస్ఐ అనుమతి లేకుండా ఆ మసీదులోకి రాకపోకలు, అనధికారిక మార్పులు చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలో రక్షిత వారసత్వ కట్టడమైన ఆ మసీదుపై నియంత్రణ, నిర్వహణను ఏఎస్ఐకు అప్పగించాలని కోర్టును కోరినట్లు వెల్లడించారు. ఈ అభ్యర్థనను కోర్టు పరిశీలించే అవకాశమున్నదని అన్నారు.
మరోవైపు గతంలో అక్కడున్న ఆలయాన్ని కూల్చి ఆ మసీదును నిర్మించినట్లు ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీని గురించి సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. నవంబర్ 24న సర్వే కోసం వెళ్లిన బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు బాష్పాయువు ప్రయోగించారు.
కాగా, ఈ హింసాకాండలో నలుగురు వ్యక్తులు మరణించగా పోలీసులతో సహా 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింసాకాండపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు హింస నేపథ్యంలో ఆ మసీదులో సర్వేను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.