న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది! రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్‌కు నీతి ఆయోగ్‌లో ప్రాధాన్యం లభించింది. పదవీకాలం పూర్తి కానున్న ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ కుమార్ లాహిరి నీతి ఆయోగ్ తదుపరి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
బెంగాల్ కోణానికి మరింత బలాన్నిస్తూ ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్, విద్యావేత్త గోవర్దన్ దాస్ కూడా నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆర్థికవేత్త కేవీ రాజు, ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్, సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్ కరండికర్, మాజీ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబతోసహా ఐదుగురు పూర్తికాల సభ్యులను ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా నియమితులైన లాహిరి ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిశారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా లాహిరికి శుభాకాంక్షలు తెలియచేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెక్ పెట్టి ప్రజాభిమాన్ని సంపాదించుకోవడానికి నీతి ఆయోగ్‌లో బెంగాల్ వ్యక్తులకు కేంద్రం పెద్ద పీట వేసినట్టు విమర్శకులు వ్యాఖ్యానించారు.