Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌లో మిత్రపక్షాలుగా ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచినప్పటి నుంచి ఆప్ తీరు మారిందని ఆశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఆప్ మళ్లీ గెలిస్తే అపరాధికి ఆశ్రయం ఇచ్చినట్లు అవుతుందని, అందుకే ఢిల్లీలో తాము ఆప్‌కు ప్రత్యర్థులమని వ్యాఖ్యానించారు.
అయితే అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలను ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ వెంటనే తిప్పికొట్టారు. గెహ్లాట్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి సహకారాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అంతకుముందు అర్వింద్ కేజ్రీవాల్‌ను కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ జాతి వ్యతిరేకి అని వ్యాఖ్యానించడంతో రెండు పార్టీల మధ్య వివాదం మొదలైంది. అజయ్ మాకెన్ క్షమాపణ చెప్పకపోతే ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించాలని ఇతర పార్టీలను కోరతామని ఆప్ ప్రకటించింది.
అంతేగాక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చూకూరేలా వ్యవహరిస్తున్నదని ఆప్ ఆరోపించింది. ఈ విషయాన్ని మీడియా బుధవారం అశోక్ గెహ్లాట్ దగ్గర ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. దాంతో వెంటనే కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.