జైపూర్ : ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా రైతులను అపహాస్యం చేశారని, వారిని ఆందోళనకారులుగా చిత్రీకరించారని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ శనివారం పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేసే సమయంలో రైతులపై కపట ప్రేమ ఒలకబోశారని వ్యాఖ్యానించారు. పంజాబ్, యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కితీసుకుందని అన్నారు.
రైతులకు వ్యతిరేకంగా బీజేపీ మిత్రపక్షాల నేతలు అవాకులు చవాకులు పేలారని వారు రైతులను ఖలిస్తానీలు, ఉగ్రవాదులతో పోల్చారని ఆయన మండిపడ్డారు. జైపూర్లో జరిగిన కిసాన్ విజయ్ దివస్ కార్యక్రమంలో మాట్లాడుతూ గెహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను నిందించిన కాషాయ పార్టీ నేతల బాగోతం ప్రధాని మోదీ శుక్రవారం రైతులక క్షమాపణ చెప్పడంతో బట్టబయలైందని అన్నారు. రైతుల కష్టం తెలియని ఫాసిస్టు పాలకుల చేతిలో దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అశోక్ గెహ్లోత్ ఆందోళన వ్యక్తం చేశారు.