Asaram | మైనర్ వేధింపుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపు జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆయన ఏడురోజుల పెరోల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఆయన మహారాష్ట్ర మధోబాగ్లో చికిత్స పొందనున్నారు. అయితే, ఈ సమయంలో ఆయన పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. ఆశారాం బాపు చికిత్స కోసం పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుంటూ వస్తుండగా గతంలో తిరస్కరణకు గురయ్యాయి. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో జోధ్‌పూర్‌లోని ప్రైవేటు ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది. అక్కడ పుణేకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో జోధ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన మళ్లీ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు ఏడురోజులు అనుమతి ఇచ్చారు. జూన్ 20న ఆశారాం కోర్టు నుంచి 20 రోజుల పాటు పెరోల్ కోరారు. పెరోల్ కమిటీ దాన్ని తిరస్కరించింది.
85 ఏళ్ల ఆశారాం బాపు 2013 నుంచి జోధ్‌పూర్ జైలులో ఉంటున్నారు. మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపును జోధ్‌పూర్ పోలీసులు 2013లో ఇండోర్‌లో అరెస్టు చేశారు. ఆశారాం తన ఆశ్రమంలో ఓ టీనేజీ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఐదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 25 ఏప్రిల్ 2018న కోర్టు ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. ఆశారాం బాపుకు 85 ఏళ్లు ఉన్నాయి. వయో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే, పోస్కో కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో జీవితఖైదును రద్దు చేయాలని కోరగా.. తోసిపుచ్చింది. వైద్యం కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇచ్చింది. దాంతో రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏడు రోజుల పెరోల్‌కు హైకోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.