Priyanka Gandhi: కేంద్రంలో బీజేపీ అధికారంవల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాకు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. రాహుల్‌గాంధీ యాత్రకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘మీకు ఉద్యోగాలు రానంత వరకు ఎలాంటి సదుపాయాలు సమకూరవు. పేపర్ లీకేజీలు ఆగవు. అభివృద్ధి జరగదు.’ అని వ్యాఖ్యానించారు.
గత పదేళ్లుగా మీరు ఎదుర్కొంటున్న అనుభవాలను బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రియాంకాగాంధీ జనానికి సూచించారు. కేంద్రంలో అధికారం చేతులు మారితేనే పేద ప్రజల తలరాతలు మారుతాయని అన్నారు.