న్యూఢిల్లీ, జూన్ 3: ఆర్యసమాజ్‌లో జరిగే పెండ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్యసమాజ్ జారీచేసే పెండ్లి సర్టిఫికెట్లను గుర్తించబోమని తేల్చి చెప్పింది. పెండ్లి సర్టిఫికెట్లు జారీచేసే అధికారం ఆర్యసమాజ్‌కు లేదని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు మాత్రమే పెండ్లి సర్టిఫికెట్లను జారీ చేయాలని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ప్రేమ వివాహానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆ సర్టిఫికెట్‌ను గుర్తించబోం
మైనర్ అయిన తమ కూతురుని ఓ యువకుడు కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబసభ్యులు కేసు పెట్టారు. ఐపీసీలోని పలు సెక్షన్లు, పోక్సో చట్టం కింద నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఆ బాలిక మేజర్ అని, తన ఇష్టానుసారమే తామిద్దరమూ ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నామని నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా ఆర్య సమాజ్‌లో పెండ్లి జరిగినట్టు భారతీయ ఆర్య ప్రతినిధి సభ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆర్యసమాజ్ జారీచేసిన సర్టిఫికెట్‌ను గుర్తించేది లేదని స్పష్టంచేసింది. ‘పెండ్లి సర్టిఫికెట్లను జారీ చేయడం ఆర్యసమాజ్ పని కాదు. దానికి ఆ అధికారం లేదు. పెండ్లి ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేక వివాహ చట్టం కింద సంబంధిత అధికారులు మాత్రమే జారీ చేస్తారు. అలాంటి సర్టిఫికెట్లు ఉంటే తీసుకురండి’ అని నిందితుడి తరుఫు న్యాయవాదికి సూచించింది. నిందితుడు పెట్టుకొన్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ కేసు విషయంలో నిందితుడికి గతంలో బెయిల్‌ను నిరాకరించింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.